మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 22, 2020 , 08:54:46

ముంపు సమస్య లేకుండా మూసీలోకి పైప్‌లైన్‌

ముంపు సమస్య లేకుండా  మూసీలోకి పైప్‌లైన్‌

ఉప్పల్‌/ రామంతాపూర్‌, అక్టోబర్‌ 21 : వరద నీరు కాలనీలను ముంచెత్తకుండా శాశ్వత పరాష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రామంతాపూర్‌లోని నేతాజీనగర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి బుధవారం ఆయన పర్యటించారు. మోకాలి లోతులో నీటిలో ముంపు బాధితుల ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించారు. వాన నీళ్లు, మురుగు మూసీలోకి నేరుగా వెళ్లేలా పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. బాధితులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, ఉప్పల్‌ డీసీ అరుణకుమారి, కార్పొరేటర్‌ గంథం జ్యోత్స్నానాగేశ్వర్‌రావు, శేఖర్‌, సరస్వతి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాగ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్‌, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, గిరిబాబు, కుమారస్వామి, సాయికుమార్‌, డాక్టర్‌ బీవీచారి, సంపత్‌కుమార్‌, సతీశ్‌, శంబుసాయి, వెంకట్‌రెడ్డి, సంధ్య, సోమనారాయణ పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు వినతులు

రామంతాపూర్‌ లక్ష్మీనారాయణ కాలనీలో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌కు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లుకాస్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌ వినతిపత్రం ఇచ్చారు. నేతాజీనగర్‌కి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ అధ్యక్షుడు చాంద్‌షాష, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రగతి నగర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బల వెంకట్‌రెడ్డి కోరారు. చిన్న చెరువులో అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని సీపీఎం నాయకులు ఎర్రం శ్రీనివాస్‌ కోరారు. మిషన్‌ కాకతీయ కింద చిన్న చెరువు, పెద్దచెరువులను అభివృద్ధి చేయాలని రామంతాపూర్‌ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధీటి మల్లయ్య, పూస సత్తయ్య మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం ఇచ్చారు. సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.

బోడుప్పల్‌ : వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం బోడుప్పల్‌లోని ముంపు ప్రాంతాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి పర్యటించారు. స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో 16మందికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైతే మరింత సాయం చేస్తామని హామీనిచ్చారు. జల ప్రళయానికి జన జీవనం అస్తవ్యస్తం కావడం బాధకరమని, తక్షణ సాయం కింద బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 225 కుటుంబాలకు ఆర్థిక అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, వరద నీటిని తొలగించాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, కమిషనర్‌ ఎన్‌.శంకర్‌ను ఆదేశించారు. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, మేడిపల్లి తహసీల్ద్ధార్‌ ఎస్తేరి అనిత, కమిషనర్‌ ఎన్‌.శంకర్‌, మేనేజర్‌ సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నగరాధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వెంటనే సహాయం చేయడం ఎక్కడా చూడలేదు

మాది స్వస్థలం ఒడిశా. అక్కడ సముద్రతీర ప్రాంతంలో మా కుటుంబం నివసించేది. తీర ప్రాంతం కావడంతో ఎన్నో సార్లు మా కుటుంబం వరద ఇబ్బందులు ఎదుర్కొంది. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన నేను.. ప్రైవేట్‌ జాబ్‌ చేస్తూ.. తారానగర్‌లోని నాలా సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నా. ఈ మధ్య వచ్చిన భారీ వర్షానికి వరద ఇంట్లోకి వచ్చి నీటితో నిండిపోయింది. వరద ముప్పునకు గురైన వెంటనే ఇంత తొందరగా ప్రభుత్వం పదివేల రూపాయలు అందించి.. పేదలను ఆదుకోవడం ఎక్కడా చూడలేదు. వరద బాధితుల  కష్టాలను తెలుసుకొని వెంటనే సహాయం చేయడం అభినందనీయం. ఇది సీఎం కేసీఆర్‌ సార్‌ మంచి మనసుకు నిదర్శనం.  - సుమంత్‌ కుమార్‌ త్రిపాఠి