సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 18, 2020 , 07:31:27

ఫార్మా కంపెనీ మెయిల్ హ్యాక్..!

ఫార్మా కంపెనీ మెయిల్ హ్యాక్..!

హైదరాబాద్: సైబర్‌ క్రిమినల్స్‌..ఓ ఫార్మా కంపెనీ మెయిల్‌ హ్యాక్‌చేసి..లక్షలాది రూపాయలను కాజేశారు. ఈ సంఘటన  రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీ.. విదేశాలకు ముడి పదార్థాలను సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో లండన్‌లోని ఓ ఫార్మా కంపెనీకి  కోట్లాది రూపాయల ముడి పదార్థాలను ఎగుమతి చేసింది. దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. అయితే.. ఇటీవల వారికి విదేశీ కంపెనీ ప్రతినిధి నుంచి ఫోన్‌ వచ్చింది. సార్‌.. మీరు మార్చిన కొత్త బ్యాంకు ఖాతాకు 60 వేల డాలర్లను పంపాం.. అందాయా అని అడిగాడు. కంపెనీవారు షాక్‌ కు గురై.. బ్యాంకు ఖాతాలు, మెయిల్స్‌ను పరిశీలించుకున్నారు. ఆ తర్వాత మేం ఎలాంటి బ్యాంకు ఖాతా మార్చలేదని స్పష్టం చేశారు. వెంటనే మీ కు వచ్చిన మెయిల్‌ పంపండని అడుగగా పంపించారు. pruthvikalyan pharmaceticuals ఇది అసలు కంపెనీది...లండన్‌ కంపెనీకి వచ్చిన మెయిల్‌-pruthviikalyan pharmceticuals అని ఉంది. దీన్ని సూక్ష్మంగా పరిశీలించగా  i అక్షరం రెండుసార్లు వచ్చిందని నిర్థారించుకున్నారు. దీంతో మెయిల్‌ హ్యాక్‌ అయిందని గుర్తించిన నాచారం ఫార్మ కంపెనీ.. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే లండన్‌లోని పోలీసులకు అక్కడి కంపెనీ వారు ఫిర్యాదు చేశారు. 

రాచకొండ సైబర్‌ క్రైం పోలీసుల దర్యాప్తులో సైబర్‌ క్రిమినల్స్‌ నాచారం కంపెనీకి సంబంధించిన మెయిల్‌ను హ్యాక్‌ చేశారని తేలింది. అందులోని పలు మెయిల్స్‌ను తనిఖీ చేసి.. ఇటీవల జరిగిన ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. విదేశీ కంపెనీ నుంచి డబ్బు వచ్చే సమయం సమీపిస్తుండడంతో సైబర్‌ క్రిమినల్స్‌.. ఆ డబ్బులు కాజేయడానికి స్కెచ్‌ వేశారు. ఇందులో భాగంగా వారు నాచారం కంపెనీ మెయి ల్‌ ఐడీలో ఆంగ్ల అక్షరం iను రెండు సార్లు సృష్టించి సేమ్‌ టూ సేమ్‌ మెయిల్‌ ఐడీని తయారు చేసి దాని ద్వారా విదేశీ కంపెనీకి మెయిల్‌ పెట్టారు. అందులో మా కంపెనీ బ్యాంకు ఖాతాను మరో బ్యాంకుకు మార్చాం... మీరు ఇప్పటి నుంచి మీ పేమెంట్‌ మొత్తం కొత్త ఖాతాలో చేయాలని  ఉంది. మెయిల్‌ ఐడీలో అక్షరాలు తేడాను గమనించకుండా విదేశీ ఫార్మా కంపెనీ సైబర్‌ క్రిమినల్స్‌ ఖాతాలో 60 వేల అమెరికా డాలర్లు వేశారని తేలింది. అయితే సైబర్‌ క్రిమినల్స్‌ స్పూఫింగ్‌ మెయిల్‌ లోని ఖాతా గురించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఖాతా మలేషియా కౌలాలంపూర్‌లోని బ్యాంకు సంబంధించిందిగా తేలింది. ఇది నైజీరియన్‌ ఫ్రాడ్‌ అని పోలీసులు నిర్థారించుకున్నారు.


అప్రమత్తంగా ఉండాలి: హరినాథ్‌, ఏసీపీ రాచకొండ సైబర్‌ క్రైమ్స్‌

కార్పొరేట్‌ బిజినెస్‌చేసే వారు, ఇతర వ్యాపారాలు చేసేవారు, ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసే వారు.. తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మెయిల్స్‌ వచ్చినప్పుడు.. వాటిని కచ్చితంగా ఒక్కటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ఖాతా మార్చామని మెయిల్‌ వస్తే అది సైబర్‌ క్రైం చీటింగ్‌ మెయిల్‌గా అనుమానపడి.. వెంటనే వారితో మాట్లాడి నిర్థారించుకోవాలి. అప్పటి వరకు కొత్త ఖాతాలో డబ్బులు ఎవరూ వేయొద్దు. కార్పొరేట్‌ సంస్థలు కూడా వారికి ఉండే హడావిడిలో అసలు మెయిల్‌ , డూప్లికేట్‌ మెయిల్‌ను నిర్థ్ధారించుకోవడం లేదు. తీరా డబ్బులు పోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  అలా కాకుండా ఆన్‌లైన్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సైబర్‌ క్రిమినల్స్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి ఫ్రాడ్‌ జరగదు.                                                                 logo