e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home హైదరాబాద్‌ రైతులకు వరం ఔషధ నగరం

రైతులకు వరం ఔషధ నగరం

రైతులకు వరం ఔషధ నగరం
  • రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీ
  • చక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగం
  • ఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల ప్లాట్‌
  • ఇచ్చిన ప్లాట్లలో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు
  • 1400 ఎకరాల్లో నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు
  • మెగా వెంచర్‌ను ప్రారంభించిన మంత్రి సబిత
  • భవిష్యత్తులో హైటెక్‌సిటీ తరహాలో అభివృద్ధి

కాలుష్య రహిత ఔషధ సంస్థల స్థాపన కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఔషధ నగరి (ఫార్మా సిటీ) ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. భూసేకరణ ప్రక్రియ, పరిహారం చెల్లింపు చురుగ్గా సాగుతుండగా, భూములు కోల్పోయిన రైతులకు స్థలాలు ఇవ్వనుంది. రోడ్లు, తాగునీరు, వైకుంఠధామం, పాఠశాలలు, పార్కులు ఇతర మౌలిక వసతులు కల్పించేలా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసే మెగా వెంచర్‌ను బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలోని బేగరికంచెలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని, పూర్తయిన తర్వాత ఇంటికో ఉద్యోగం తప్పకుండా ఇస్తామని చెప్పారు. ఎకరానికి రూ.16 లక్షల పరిహారం, 121 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసి ఇస్తామని, మొత్తం 1400 ఎకరాల మెగా వెంచర్‌లో 600 ఎకరాల్లో రైతులు ఇండ్లు నిర్మించుకోవచ్చని, మిగతా స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయిస్తామని పేర్కొన్నారు.

కందుకూరు : ఆధునిక వసతులతో ప్రపంచంలోనే ఫార్మాసిటీ మెగా వెంచర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ.700కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. మొదటగా రూ.100కోట్లను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై అపోహలు వద్దని ఆమె సూచించారు. మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట్‌ రెవెన్యూ పరిధిలోని బేగరికంచె పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు అసైండ్‌ భూమి కలిగిన వారికి రూ. 8లక్షలు, పట్టాభూమి ఉన్న వారికి రూ.16లక్షల నష్టపరిహారంతో పాటు 121గంజాల ఇంటి స్థలాన్ని ఇస్తుందని వెల్లడించారు.

ఈ మెగా వెంచర్‌ను బుధవారం చేవెళ్ల్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట్‌రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతున్నదని అది ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని చెప్పారు. మెగా వెంచర్‌ కోసం సేకరించిన 1400ఎకరాల్లో 600 ఎకరాలు తిరిగి రైతుల ఇండ్ల నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మిగిలిన భూమిలో 33శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ వెంచర్‌లో 5సెక్టార్లను ఏర్పాటు చేసి ప్రతి సెక్టారులో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, పీహెచ్‌సీలు, షాపింగ్‌ మాల్స్‌,కమ్యూనిటీహాల్‌ లాంటి అన్ని సౌకర్యాలతో ఒక నూతన పట్టణంగా ఫార్మా మెగా సిటీ ఏర్పాటవుతుందన్నారు. ఇది భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.అంతే కాకుండా భూములు ఇచ్చిన కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సముఖంగా ఉన్నారని చెప్పారు. ఈ నెలాఖరులోగా కందుకూరు, ఇబ్రహీంపట్నంలో యువతకు నైపుణ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఫార్మా రంగానికి సంబంధించి యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు కన్నా ముందు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.750కోట్లను ఇప్పటికే భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిందని, మరో రూ.300కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.భవిష్యత్‌లో హైటెక్‌ సిటీగా మారుతుందని చెప్పారు.ఫార్మా కంపెనీతో కొత్తగా 5లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అనంతరం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా కల్పించడానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులకు వరం ఔషధ నగరం

ట్రెండింగ్‌

Advertisement