శుక్రవారం 05 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 06:17:09

అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త

అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త

‘స్వప్నక్కా.. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్లిపోతున్నా.. నేను మస్తు బాధపడ్డ.. మిమ్ముల్ని కూడా చాలా బాధపెట్టిన.. నాకు అమ్మ తరువాత అమ్మవు నువ్వే... నువ్వు నాకు చేసినంత ఎవ్వరూ చేయలేదు...  సరే.. నేను పోతున్నా.. కానీ నా పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకో .. నువ్వు తప్పా నాకు ఎవరూ లేరు అక్కా చూసుకునేటోళ్లు.. సరేనా అక్కా’ అంటూ ఓ వ్యక్తి  సెల్ఫీ వీడియా తీసి అక్కకు వాట్సాప్‌ ద్వారా పంపి.. తనువుచాలించాడు. అలాగే..  తన చావుకు అప్పులు ఇచ్చిన వారి వేధింపులే కారణమని వ్యాట్సాప్‌ ద్వారా అక్కకు మెసేజ్‌ పంపాడు. అప్పుల బాధతో తీవ్ర  మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ విషాద ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.

ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప కథనం ప్రకారం..

అడ్డగుట్ట ఏ సెక్షన్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ కుమారుడు దండు కిరణ్‌(35)కు భార్య మంజుల, ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. కిరణ్‌ సికింద్రాబాద్‌ అంజలి థియేటర్‌ వద్ద చెరుకు గడల వ్యాపారం చేస్తుంటాడు. కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాడు. దీంతో కుటుంబ పోషణ కష్టమై అప్పులు చేశాడు.. రోజురోజుకు అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువయ్యాయి. రెండు రోజుల క్రితం అప్పులు ఇచ్చినవారు ఇంటికి వచ్చి కిరణ్‌ తిట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

సంక్రాంతి పండుగకు తల్లి బంధువుల ఇంటికి వెళ్లగా... భార్య.. పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో కిరణ్‌ ఒక్కడే ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి ‘తాను చనిపోతున్నానని, తన పిల్లలను బాగా చూసుకోవాలని’ అక్క స్వప్నకు వీడియా తీసి పంపించాడు. అనంతరం ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు రాత్రి కిరణ్‌కు భార్య మంజుల ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో పక్కన ఉండేవారికి ఫోన్‌చేసి.. తన భర్తతో మాట్లాడించమని కోరింది. వారు వెళ్లి చూసేసరికి కిరణ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్నాడు. వెంటనే వారు విషయాన్ని కిరణ్‌ కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

VIDEOS

logo