శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 16, 2020 , 07:31:09

ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

హైదరాబాద్ : రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన  వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది.   క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొత్త పంథాను ఎంచుకున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేయిస్తున్నది. ప్రాథమికంగా దీనికి టీఎస్‌ ఎయిర్‌ యాప్‌ అని ఖరారుచేయగా, త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. గ్రేటర్‌లో కాలుష్యం రోజురోజు పంజా విసురుతున్నది. ముఖ్యంగా వాహనాలు, బయోమాస్‌ల కాల్చివేత తీవ్రమవుతున్నది. చెత్త అక్రమ రవాణా, డంపింగ్‌లు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

విషవాయువులను నేరుగా గాల్లోకి వదిలేయడం, వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కాల్చివేయడం జరుగుతున్నది. ఇలా చేయడం పర్యావరణ చట్టాల ప్రకారం చట్ట విరుద్ధం. ఇలా చేసిన వారిపై పీసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నది. అంతేకాదు. ఇందుకు కారకులైన కంపెనీలను మూసివేస్తున్నది. అయినా అధికారుల నిఘా లేకపోవడంతో గ్రేటర్‌లోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. కొంత మంది ఇష్టారీతిన చెత్తను కాలుస్తున్నారు. అయితే దీనిపై అధికారులకు తగు సమాచారమందడం లేదు. 

పౌరుల భాగస్వామ్యానికి అవకాశం లేకపోవడంతో పీసీబీకి సమాచారం, ఫిర్యాదులు రావడం లేదు. అధికారులు ఎప్పుడో ఒకప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దొరికిన వారు దొంగ లేదంటే దొర అన్నట్లుగా అన్నట్లుగా సాగుతున్నది. ఇలాంటి ఉల్లంఘనులకు చెక్‌పెట్టేందుకు పీసీబీ ఈ తరహా వ్యూహా న్ని ఎంచుకున్నది. యాప్‌ ఆధారంగా ఫిర్యాదులను స్వీకరించనున్నది. యాప్‌ కంటే ముందు ఇప్పటికే 888616 9781 / 9121012782 హెల్ప్‌లైన్‌ నంబర్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చి అమలుచేస్తున్నారు.

- ఎక్కడైనా వాహనం పొగలు కక్కుతూ కనిపించిందా.. అయితే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయండి అంతే.. అది ఎక్కడిది.. ఏ ప్రాంతంలోనిది.. అని జీపీఎస్‌ లొకేషన్‌ సహాయంతో యాపే గుర్తుపడుతుంది. ఆయా సమాచారాన్ని రవాణాశాఖకు చేరవేస్తుంది. ఆయా వాహనానికి ఫైన్‌ వేయడం, లేదంటే వాహనాన్ని సీజ్‌చేయడానికి ఆస్కారముంటుంది.

- ఎక్కడైనా చెత్త, ఆకులు అలములు బహిరంగంగా కాల్చితే, ఓపెన్‌బర్నింగ్‌ జరిగితే ఒక్క ఫొటో తీసి పంపిస్తే చాలు  ఈ సమాచారం పీసీబీతో పాటు.. జీహెచ్‌ఎంసీ అధికారులకు చేరుతుంది. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధిస్తారు.

కాలుష్య తీవ్రతలు సైతం..

నగరంలోని వాయు కాలుష్య తీవ్రతలను సైతం ఈ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 24 వాయు కాలుష్య నమోదుకేంద్రాలున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు వాయు కాలుష్య తీవ్రతలను నమోదుచేస్తున్నారు. ఇంత కాలం ఈ వివరాలు వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉండగా,  తాజాగా ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే అరచేతిలోనే లభ్యంకానున్నాయి. గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సమీర్‌ అనే యాప్‌ను   అందుబాటులోకి తీసుకొచ్చింది. 

దేశంలో 100 నగరాల్లో నమోదవుతున్న  కాలుష్యాన్ని నమోదుచేస్తూ   పౌరులందరికి  అందుబాటులో ఉంచింది. ఇదే తరహాలో తెలంగాణ పీసీబీ అధికారులు యాప్‌ను తయారుచేయిస్తున్నారు.   మరో పక్షం రోజుల్లో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.


logo