అంబర్‌పేట : నియోజకవర్గంలోని ప్రతి పార్కు వద్ద ఆర్చ్ నిర్మాణం, ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న పార్కుల సుందరీకీకరణ విషయమై సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.
పార్కుల్లో చేయాల్సిన అభివృద్ధిని చర్చించారు. వాకింగ్ కోసం వచ్చే వృద్ధులకు, మహిళలకు అనుకూలమైన సౌకర్యాలు ఏర్పాటు, అదే విధంగా పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే పార్కులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఇప్పటికే జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, ఈఈ శంకర్, డీఈలు సంతోష్, సుధాకర్, ఏఈ శ్వేత తదితరులు పాల్గొన్నారు.