ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:49:59

సాధారణ స్థితికి ఓపీ సంఖ్య

సాధారణ స్థితికి ఓపీ సంఖ్య

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో నాన్‌కొవిడ్‌ సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. గత నెలలో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నాన్‌కొవిడ్‌ సేవలన్నీ పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలు కరోనా భయంతో కొంత జంకుతున్నారు. వారం పదిరోజులుగా నగరంలోని దవాఖానల్లోని అన్ని విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఔట్‌ పేషెంట్ల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంది. కరోనా సమయంలో 100లోపు ఉన్న ఓపీ రోగుల సంఖ్య సెప్టెంబర్‌ నాటికి 500దాటింది. సాధారణంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ వంటి ట్రెషరీ దవాఖానల్లో రోజువారీ ఓపీ సంఖ్య 1800 నుంచి 2000 వరకు ఉంటుంది. కరోనా కారణంగా తగ్గిన ఓపీ సంఖ్య ఇప్పుడు యథాస్థితికి చేరుకుంది. ఉస్మానియాలో ఓపీ సంఖ్య 1500 దాటుతున్నట్లు దవాఖాన సూరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు. నిలోఫర్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన, నిమ్స్‌, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానల్లో సైతం ఓపీ సంఖ్య సాధారణ స్థితికి చేరుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఓపీల సంఖ్య యథాస్థితికి చేరుకోవడంతో చాలా దవాఖానల్లో క్వారంటైన్‌ సెలవులను రద్దు చేశారు. నిర్ణీత క్లిష్టమైన శస్త్రచికిత్సలను కరోనా సమయంలో వాయిదా వేయగా ప్రస్తుతం అన్ని రకాల శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉస్మానియాలో అవయవాల స్థానభ్రంశం చెందిన ఒక రోగికి అరుదైన రెండు శస్త్రచికిత్సలు చేశారు. సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్న గర్భిణికి మూడు శస్త్రచిక్తిత్సలు చేసి పునర్జీవం పోశారు. వాయిదా పడిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు సైతం పునఃప్రారంభించినట్లు జీవన్‌దాన్‌ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు కరోనా పరీక్షలు జరిపిన తరువాత అవయవాల సేకరణ, ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తున్నట్లు వైద్యాధికారులు వివరించారు.