ఆదివారం 31 మే 2020
Hyderabad - May 19, 2020 , 00:34:20

అందుబాటులోకి ఓపీ సేవలు..పెరిగిన రద్దీ

అందుబాటులోకి ఓపీ సేవలు..పెరిగిన రద్దీ

హైదరాబాద్  : కరోనా వల్ల నిలిచిపోయిన ఓపీ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో రోగుల రద్దీ కనిపించింది. గాంధీ మినహా అన్ని బోధనాసుపత్రుల్లో సేవలను పునరుద్ధరించారు. కరోనా వ్యాప్తితో మొన్నటి వరకు ప్రైవేటు వైద్యశాలల్లో ఔట్‌ పేషెంట్‌ సేవలు పూర్తిగా నిలిపివేయగా,  సర్కారు దవాఖానల్లో మాత్రం అత్యవసర ఔట్‌ పేషెంట్‌ సేవలు, శస్త్రచికిత్సలు కొనసాగాయి.  తాజాగా పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రావడంతో రోగులు తరలివచ్చారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని వైద్యులు చికిత్స అందించారు. 

30 శాతం...

కొవిడ్‌ కేంద్రాలైన గాంధీ, ఎర్రగడ్డ ఛాతి దవాఖానల మినహా ఉస్మానియా, నిలోఫర్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌, పేట్లబుర్జ్‌, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానలు, నల్లకుంట ఫీవరాస్పత్రి, కోఠి ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి దవాఖానల్లోని అన్ని విభాగాల్లో ఓపీ సేవలు మొదలయ్యాయి.  ఉస్మానియాలో 21 విభాగాలు, నిలోఫర్‌లో ఐదు ప్రధాన విభాగాలు, మహిళలకు సంబంధించిన ప్రసూతి విభాగం, ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖానలో మెడికల్‌, క్లినికల్‌, సర్జికల్‌ అంకాలజీ తదితర చికిత్సలు, పేట్లబుర్జ్‌, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖానల్లో సేవలు కొనసాగాయి.  ప్రస్తుతం 30 శాతం రోగుల సంఖ్య పెరిగిందని, రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తెలిపారు.  


logo