హైదరాబాద్ మహా నగరానికి మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు లాజిస్టిక్ హబ్‌లకు కేంద్రంగా మారింది. దేశ నలుమూలల నుంచి వస్తువుల రవాణాకు మెరుగైన రోడ్ నెట్ వర్క్ ఔటర్ చుట్టూ ఉండటంతో దీని చుట్టూనే తమ గోదాంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వస్తువుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఓఆర్ఆర్ చుట్టూ ఎకరాల కొద్ది స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే లాజిస్టిక్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) విజయవాడ జాతీయ రహదారిపై బాట సింగారం వద్ద, నాగార్జున సాగర్ హైవే పై మంగల్‌పల్లి వద్ద రెండు లాజిస్టిక్ పార్కులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ) విధానంలో ఏర్పాటు చేశారు. వీటితో పాటు నేరుగా ప్రైవేటు సంస్థలు 500లకు పైగా గోదాంలను ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న గ్రోత్ కారిడార్లోనే ఏర్పాటు చేశాయి. కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఔటర్ చుట్టూ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడంతో పాటు మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునేందుకు సరైన ప్రాంతం ఔటర్ రింగు రోడ్డును గ్రోత్ కారిడార్‌గా గుర్తించారు.
గ్రేటర్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవున ఉన్న ఓఆర్ఆర్కు ఇరువైపులా ఒక కిలోమీటర్ దూరం వరకు గ్రోత్ కారిడార్‌గా నిర్ణయించారు. గ్రోత్ కారిడార్ పరిధిలో ప్రత్యేకంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు నివాస సముదాయాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో అనుమతి ఉంది. దీంతో భారత భూభాగంలో హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉండటం కూడా లాజిస్టిక్ రంగానికి ఎంతో అనువుగా మారింది. ఈ-కామర్స్ సంస్థలు, రిటైల్ మార్కెటింగ్ సంస్థలు సైతం తమ గోదాంలను నగరం లోపల కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి నగరం లోపలికి చేరుకునేందుకు మెరుగైన రోడ్ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మొత్తం 33 రేడియల్ రోడ్లను గుర్తించి, వాటిని విశాలంగా నిర్మించారు. ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఓఆర్ఆర్ వరకు 100 అడుగుల నుంచి 120 అడుగుల వెడల్పుతో, అక్కడి నుంచి కోర్ సిటీలోకి 80, 100 అడుగులతో రోడ్లను నిర్మించడంతో రవాణా పరంగా రోడ్ నెట్ వర్క్ మెరుగ్గా ఉంది. దీంతో ఓఆర్ఆర్ చుట్టు పక్కల ఏర్పాటు చేసిన గోదాం నుంచి నగరానికి వచ్చివెళ్లాలన్నా, దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి గోదాంల వరకు ఎలాంటి భారీ వాహనాలైనా చేరుకునే రోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే లాజిస్టిక్ రంగం దినదినాభివృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నది.