e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌

ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌

ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌
  • ఓఆర్‌ఆర్‌ మీదుగా నేరుగా నియో పొలిస్‌లోకి వాహనాలు
  • సులువుగా వచ్చిపోయేలా ఆధునిక శైలిలో కూడలి
  • గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌-కోకాపేట మధ్య తగ్గనున్న రద్దీ
  • ఐటీ కారిడార్‌లో ప్రత్యేకాకర్షణగా నిలవనున్న నిర్మాణం
  • సిగ్నల్‌ లేకుండానే కోకాపేట మూవీ టవర్స్‌ చౌరస్తాలో రాకపోకలు
  • ఔటర్‌పై తొలి ట్రంపెట్‌ ఇదే.. చురుగ్గా సాగుతున్న పనులు

నగరానికి పశ్చిమాన కోకాపేట వద్ద అత్యున్నత ప్రమాణాలతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న ‘నియోపొలిస్‌’ భారీ లేఅవుట్‌కు మరో ప్రత్యేకాకర్షణ. ఔటర్‌రింగ్‌ రోడ్డు నుంచి నేరుగా ఈ లేఅవుట్‌లోకి రాకపోకలు సాగించేలా కోకాపేట-గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ల మధ్య ట్రంపెట్‌ (జంక్షన్‌ను పోలి ఉండేది) నిర్మిస్తున్నారు. నియో పొలిస్‌ భారీ లేఅవుట్‌ను చేసే నిర్మాణ సంస్థనే ఈ ట్రంపెట్‌ను నిర్మిస్తున్నది. ఇది పూర్తయితే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంతోపాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌-కోకాపేట మధ్య ట్రాఫిక్‌ సమస్య శాశ్వతంగా తొలగి రాకపోకలు సులభం కానున్నాయి.

హెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా విక్రయించనున్న ఈ భారీ లేవుట్‌లోని ప్లాట్లల్లో పూర్తిగా బహుళ అంతస్థుల నిర్మాణాలు జరగనుండడంతో ముందస్తుగానే ట్రంపెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. 158 కి.మీ పొడవుగల ఔటర్‌పై తొలిసారి ఫ్లైఓవర్‌తో ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, మోకిల ప్రాంతాల భూములకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉండనుంది.

- Advertisement -

ఐటీ కారిడార్‌లో మరో నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. కోకాపేటలో మూవీ టవర్స్‌ వద్ద వందలాది ఎకరాల్లో లేఅవుట్లను సిద్ధం చేస్తున్న హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. ఇక్కడికి రాకపోకలు సులువుగా ఉండేందుకు అత్యున్నత ప్రమాణాలతో ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి చౌరస్తా నుంచి ఔటర్‌ రింగు రోడ్డు పైకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంది. అయితే ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌ వైపు నుంచి కోకాపేటకు రావాలంటే ప్రసుత్తం ఉన్న ఇంటర్‌చేంజ్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు ట్రంపెట్‌ నిర్మాణాన్ని చేపట్టింది. దీనివల్ల ఐటీ కంపెనీల ప్రతినిధులు నేరుగా ‘నియోపొలిస్‌’లో నిర్మించే తమ కార్యాలయాలు, భవనాల వద్దకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేరుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా శంకర్‌పల్లి ప్రధాన రహదారికి గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుంది.

ఓఆర్‌ఆర్‌ మీదుగా నేరుగా..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ఓఆర్‌ఆర్‌ మీదుగా వచ్చే వాహనాలు నేరుగా కోకాపేటలోని నియోపోలీస్‌ లేఅవుట్‌, గోల్డ్‌ మైల్‌ లేఅవుట్‌లోకి, శంకర్‌పల్లి రోడ్డుకు చేరుకునేలా ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న నియోపొలీస్‌ లేఅవుట్‌తో పాటు ట్రంపెట్‌ నిర్మాణ పనులను ఒకే కంపెనీలు చేపట్టాయి. ప్రసుత్తం కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలానికి ప్రకటన చేయడంతో ఓఆర్‌ఆర్‌ ట్రంపెట్‌ నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకున్నది. హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ వేలంలో విక్రయిస్తున్న ప్లాట్లలో పూర్తిగా హైరైజ్‌ బిల్డింగ్‌లు నిర్మించేందుకు అవకాశం ఉండటంతో భారీ ఎత్తున నిర్మాణాలు పెరిగి, ట్రాఫిక్‌ రద్దీ పెరుగనున్నది. దీనికి అనుగుణంగా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఉండేందుకు ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు.

ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ..

నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌ శరవేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ పెరిగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో అవసరమైన రోడ్ల విస్తరణతో పాటు ఫ్లైఓవర్‌ ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. మరోవైపు నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న ఓఆర్‌ఆర్‌ ప్రధాన రహదారితో పాటు, ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల మీద రాకపోకలు అధికమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు వరుసలతో ఉన్న సర్వీసు రోడ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తున్నది. సుమారు రూ.312 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌
ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌
ఓఆర్‌ఆర్‌పై ట్రంపెట్‌ జంక్షన్‌

ట్రెండింగ్‌

Advertisement