e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ ఔటర్‌ ఔరా అనేలా..!

ఔటర్‌ ఔరా అనేలా..!

ఔటర్‌ ఔరా అనేలా..!
  • ప్రతిష్టాత్మకంగా ఔటర్‌ రింగు రోడ్డు నిర్వహణ
  • ప్రధాన రహదారి, సర్వీసు రోడ్ల బాధ్యత ప్రైవేటు సంస్థలకు
  • 3 ఏళ్ల పాటు అప్పగించేందుకు టెండర్‌లు
  • నగరంపై ఒత్తిడి తగ్గించే వ్యూహం
  • శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులే లక్ష్యం

సిటీబ్యూరో,జూన్‌ 2 (నమస్తే తెలంగాణ) : మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగు రోడ్డు నిర్వహణను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్‌ చుట్టూ 158 కి.మీ పొడువునా ఉన్న ఓఆర్‌ఆర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. దాని నిర్వహణను అదేస్థాయిలో ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. 8 వరుసల్లో ప్రధాన రహదారి (మెయిన్‌ క్యారేజ్‌ వే)తో పాటు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణ తరచూ శుభ్రం చేసే బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌లో రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1లో పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్‌ ఇంటర్‌చేంజ్‌ వరకు, ప్యాకేజీ -2లో గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వరకు నిర్ణయించారు.

ఈ ప్రాంతాల్లో ఔటర్‌పై ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండడంతోపాటు సర్వీసు రోడ్లపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రధాన రహదారులను నిత్యం శుభ్రంగా ఉంచుతున్నట్లుగానే ఓఆర్‌ఆర్‌ను శుభ్రంగా ఉంచేందుకు ఈ టెండర్లను పిలిచారు. మూడేండ్లపాటు ఆయా సంస్థలు సమగ్ర నిర్వహణ, ఆపరేషన్‌తో సహ సెల్ఫ్‌ప్రొపెల్డ్‌ సక్షన్‌ స్వీపింగ్‌ మెషీన్స్‌ సరఫరా, ఓఆర్‌ఆర్‌ మెయిన్‌ క్యారేజ్‌ వే, సర్వీస్‌ రోడ్ల క్లీనింగ్‌ బాధ్యతలను అప్పగించనున్నారు. దీనిద్వారా ఔటర్‌ రహదారులు కూడా రాకపోకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిత్యం శుభ్రంగా ఉండేలా చేయనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు టెండర్‌ దాఖలు చేయడానికి అవకాశం ఉండగా, ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెక్నికల్‌ బిడ్‌లు తెరవనున్నారు. అర్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఓఆర్‌ఆర్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు.

ఔటర్‌ చుట్టూ అభివృద్ధి నేపథ్యంలో…

హైదరాబాద్‌ మహానగరం నలుమూలలా శరవేగంగా విస్తరిస్తున్నది. ఔటర్‌ ఇరువైపులా కొత్తగా నివాస ప్రాంతాలు పెద్ద మొత్తంలో వెలుస్తున్నాయి. అదేవిధంగా నగరానికి పడమర దిక్కున ఐటీ కారిడార్‌లో ఓఆర్‌ఆర్‌ను దాటి ఐటీ కంపెనీలకు చెందిన బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ఇంకా వందల సంఖ్యలో కొత్తగా భవనాలను నిర్మిస్తున్నారు. ఆఫీసు కార్యకలాపాలతోపాటు, నివాస ప్రాంతాలు అధికంగా ఉంటుండడంతో ఓఆర్‌ఆర్‌ రహదారుల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పెద్దఅంబర్‌పేట, నాగార్జునసాగర్‌, శ్రీశైలం, బెంగళూరు జాతీయ రహదారి, శంషాబాద్‌ మీదుగా గచ్చిబౌలి, పటాన్‌చెరు వరకు వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలతోపాటు నివాస ప్రాంతాలు విపరీతంగా పెరిగాయి.

అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, గూడ్స్‌ షెడ్లు వెలిశాయి. శివారు ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఓఆర్‌ఆర్‌ నుంచి నగరానికి వచ్చేందుకు వీలుగా నిర్మించిన 30 రేడియల్‌ రోడ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలు ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటూ నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఔటర్‌ చుట్టూ కొత్తగా నివాస ప్రాంతాలు మరింతగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఔటర్‌ ఔరా అనేలా..!

ట్రెండింగ్‌

Advertisement