సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్ : ఉస్మానియా జనరల్ దవాఖాన చరిత్రలో మరో మైలురాయికి చేరింది. తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ రంగ దవాఖానల్లోనే తొలిసారిగా ఖరీదైన ‘బ్రెస్ట్ ఆగ్మంటేషన్ కాస్మెటిక్’ సర్జరీని ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా నిర్వహించి ఓ నిరుపేద యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ మేరకు దవాఖానలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ కూతురైన 18 ఏండ్ల యువతి ‘రైట్ సైడ్ బ్రెస్ట్ హైపో ప్లేసియా’తో బాధపడుతుంది. అంటే సదరు యువతికి కుడి వైపు వక్షోజం వృద్ధిచెందలేదు. దీంతో సదరు యువతి మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతుండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు దవాఖానల్లో చూపించారు. కాస్మెటిక్ సర్జరీకి లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయని కార్పొరేట్ వైద్యులు చెప్పడంతో ఓ వైద్యుడి సూచనల మేరకు గత నెల 15న ఉస్మానియా దవాఖానను ఆశ్రయించారు. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు యువతి ‘రైట్‌సైడ్ బ్రెస్ట్ హైపో ప్లేసియా’తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అంటే యువతికి పుట్టుక నుంచే కుడివైపు వక్షోజం వృద్ధి చెందలేదని తేల్చారు.
కొంత మందిలో ‘పొలాండ్ సిండ్రోమ్’ కారణంగా వక్షోజాలు వృద్ధి చెందవని ప్లాస్టిక్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి పలుకూరి తెలిపారు. కొంతమందిలో కుడివైపు రొమ్ము వృద్ధి చెందదని దీన్ని ‘రైట్‌సైడ్ బ్రెస్ట్ హైపో ప్లాసియా’గాను, ఎడమ వైపు వృద్ధి చెందకపోతే ‘లెఫ్ట్‌సైడ్ హైపో ప్లాసియా’గాను పరిగణిస్తారని, మరికొందరిలో రెండు వైపుల వక్షోజాలు, ఛాతి భాగం, ఎముక కూడా వృద్ధి చెందవని వివరించారు. ఇంకొంత మందిలో వక్షోజాలు ట్యూబ్‌లా ఏర్పడతాయని దాన్ని ట్యూబ్లర్ బ్రెస్ట్గా పరిగణిస్తారని తెలిపారు.
ఈ శస్త్రచికిత్సకు కార్పొరేట్లో సుమారు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుందని, ఇంతటి ఖరీదైన చికిత్సను ఉస్మానియాలో పూర్తి ఉచితంగా జరిపినట్లు వైద్యులు పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో తొలిసారిగా ఈ తరహా వక్షోజానికి సంబంధించిన ఆగ్మంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు డాక్టర్ రాజ కిరణ్‌కుమార్ గౌడ్, డాక్టర్ అశ్విన్ కిశోర్, పీజీలు డాక్టర్ అస్ఫియా, డాక్టర్ ఫయ్యాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్ పావనీ, డాక్టర్ అనుపమ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పలుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన యువతికి ప్లాస్టిక్ సర్జరీ విభాగం, అనస్థీషియా విభాగానికి చెందిన మొత్తం 8మంది సభ్యులతో కూడిన వైద్య బృందం 4గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స జరిపారు. ఈ సర్జరీలో రోగికి ‘సిలికాన్ ఇంప్లాంట్’ను అమర్చారు. ‘బ్రెస్ట్ ఆగ్మంటేషన్ విత్ ఇంప్లాంట్ అండ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్’ చేశారు. దీనివల్ల యువతి ఛాతి భాగాన సహజ సిద్ధమైన ఆకారం ఏర్పడింది. అయితే కాస్మెటిక్ సర్జరీ ద్వారా అమర్చిన వక్షోజంతో ఫంక్షనింగ్ ఉండనప్పటికీ గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్యలు రావని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ వైపు వక్షోజం యథావిధిగా పనిచేస్తుందన్నారు.