బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Nov 01, 2020 , 06:28:57

వృద్ధులు, గర్భిణులకు నేరుగా ఓటింగ్‌కు అవకాశం

వృద్ధులు, గర్భిణులకు నేరుగా ఓటింగ్‌కు అవకాశం

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులతో  సమావేశమయ్యారు. అలాగే, ఎన్నికల మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

ఎన్నికల మార్గదర్శకాలు

 • మహిళలు, పురుషులకు విడివిడిగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలి. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు తదితరులకు క్యూ పద్ధతి కాకుండా నేరుగా ఓటు వేసే అవకాశం.
 • పోలింగ్‌ కేంద్రంలో 1000 ఓటర్లకు మించరాదు. గతంలో 1200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రం ఉండేది.
 • ఇరుకు గదుల్లో కాకుండా సువిశాల గదులు, హాళ్లలో పోలింగ్‌ కేంద్రాలు. 
 • ప్రతి పోలింగ్‌ కేంద్రంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు.
 • స్కూళ్లు, ప్రభుత్వ భవనాల్లోనే పోలింగ్‌ కేంద్రాలు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, మున్సిపల్‌ వార్డు కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను ప్రధానంగా పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించుకోనున్నారు.
 • పోలింగ్‌ కేంద్రాల మరమ్మతులు, తాత్కాలిక ఏర్పాట్లు ఏవైనా చేసుకోవాల్సి ఉంటే ఆ మేరకు చర్యలు తీసుకునే అధికారాలను రిటర్నింగ్‌ అధికారులకు కల్పించారు.
 • అవసరానికి అనుగుణంగా కూల్చివేయడం, ఇతరత్రా మార్పులు కూడా చేసుకునే వెసులుబాటు.
 • పోలింగ్‌ ప్రక్రియకు మూడు రోజుల ముందు వీటిని చేపట్టాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
 • పోలింగ్‌ కేంద్రం దిగువ అంతస్తులోనే ఉండాలి.
 • పోలింగ్‌ కేంద్రాల జాబితాను రిటర్నింగ్‌ అధికారులు వార్డుల్లో ప్రదర్శిస్తారు. రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, పోలీసులకు జాబితాను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు వ్యక్తులకు అవసరమైతే నిర్ణీత ధరకు విక్రయిస్తారు.
 • పోలింగ్‌ కేంద్రాల జాబితా, వార్డులవారీగా అన్ని డివిజన్లు, వార్డు కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో ప్రదర్శిస్తారు.
 • పోలింగ్‌ కేంద్రాల్లో కచ్చితంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు.
 • ప్రతి పోలింగ్‌ కేంద్రంలో క్యూలైన్ల కోసం షెడ్‌లు, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్తు, లైటింగ్‌, ర్యాంపులు, వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా చర్యలు 
 • పోలింగ్‌ కేంద్రాలు పోలీస్‌ స్టేషన్లు, దవాఖానలు, మతపరమైన భవనాల్లో ఏర్పాటు చేయరాదు.