ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:02:52

గాంధీలో సాధారణ స్థితికి ఓపీ సేవలు

గాంధీలో సాధారణ స్థితికి ఓపీ సేవలు

సిటీబ్యూరో- నమస్తే తెలంగాణ : గాంధీ దవాఖానలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల 21న దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. గాంధీ దవాఖానను కరోనా చికిత్స నోడల్‌ కేంద్రంగా మార్చడంతో దాదాపు 7నెలలపాటు సాధారణ వైద్యసేవలు నిలిపివేశారు. అయితే గత నెలలో సాధారణ వైద్య సేవలను పునఃప్రారంభించినప్పటికీ మొదట రోగుల సంఖ్య రెండంకెలకే పరిమితమైంది. దవాఖానలో కొవిడ్‌, నాన్‌కొవిడ్‌కు సంబంధించిన సేవలను వేర్వేరు భవనాల్లో అందించడంతో రోగులు కరోనా భయం వీడుతున్నారు. దీంతో గాంధీ దవాఖానలోని సాధారణ రోగుల విభాగంలో ఓపీ రోగుల సంఖ్య 500 దాటుతోంది. కరోనాకు ముందు ఈ సంఖ్య ప్రతి రోజు 3000 నుంచి 4000వరకు ఉండేదని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రతి రోజు 5 నుంచి 6 అత్యవసర శస్త్రచికిత్సలు కూడా జరుగుతున్నట్లు వివరించారు. కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ సేవలను పూర్తిగా వేర్వేరు భవనాల్లో అందిస్తున్నామని, రోగులు అయోమయానికి గురవకుండా ప్రతి ప్రవేశద్వారం వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు సమాచారం అందించేందుకు సెక్యూరిటీ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో నాన్‌కొవిడ్‌ సేవలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమైనట్లు డా.రాజారావు స్పష్టం చేశారు. అపోహలకు గురవకుండా గతంలో మాదిరిగానే గాంధీ దవాఖాన సేవలను పొందాలని సూచించారు. వైద్య సిబ్బందిని సైతం రెండు విభాగాలుగా మార్చినట్లు వివరించారు. ప్రస్తుతం గాంధీలో 138మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్లు వివరించారు. కరోనా రెండో దశపై స్పష్టత లేదని, అలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.logo