గురువారం 09 జూలై 2020
Hyderabad - Jan 08, 2020 , 10:20:38

ఆన్‌లైన్‌ డ్రా పేరుతో మోసం

ఆన్‌లైన్‌ డ్రా పేరుతో మోసం
  • ఆర్థికంగా రాలిపోతున్న అమాయక చక్రవర్తులు
  • 15 లక్షల కారు ఫ్రీగా వస్తుందని ఆశపడితే 90 లక్షలు దోచేశారు
  • సైబర్‌ మోసాలు నిత్యం జరుగుతున్నా కొరవడిన అప్రమత్తత
  • సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన నల్లగొండ వ్యాపారి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘మేం మిమ్మల్ని మోసం చేయడంలేదు.. మాపై అనుమానం ఉంటే చెప్పండి. ఇప్పటివరకు మీరు చెల్లించిన డబ్బు మొత్తం తిప్పిపంపుతాం..’ అంటూ నమ్మించిన సైబర్‌ మోసగాళ్లు మళ్లీ ఉచ్చులో పడేశారు. ఇలా వారి మాటలు ఆసాంతం నమ్మిన ఓ అమాయక చక్రవర్తి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.90 లక్షలు సమర్పించుకొన్నాడు. మోసపోయాను మహాప్రభో.. నా డబ్బులు తిరిగి ఇప్పించండంటూ ఆ వ్యక్తి ఇప్పుడు సైబర్‌ పో లీసులను ఆశ్రయించాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి మూడునెలల క్రితం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేశాడు. రెండురోజుల తర్వాత అతడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. ‘ఆన్‌లైన్‌లో షాపింగ్‌చేసిన మీరు డ్రాలో ఎక్స్‌యూవీ వాహనాన్ని గెల్చుకొన్నారు. ప్రా సెసింగ్‌ ఫీజు కింద రూ.4,500 చెల్లిస్తే రూ.15 లక్షల కారు మీ సొంతం అవుతుంది’ అని నమ్మబలికాడు. చెల్లించేది చాలా తక్కువ కదా అనుకొని వారు చెప్పినట్టుగా రూ.4,500 డిపాజిట్‌ చేశాడు. అనంతరం జీఎస్టీ, సెంట్ర ల్‌ ట్యాక్స్‌.. ఇలా మాయమాటలు చెప్పి గుర్తుతెలియని వ్యక్తి ఆయన నుంచి రూ.ఐదు లక్షలు వసూలుచేశాడు. అనుమానం వచ్చి మోసం చేస్తున్నారని నిలదీయడంతో.. ‘మా మీద నమ్మకం లేదా, అయితే మీ డబ్బు వెనక్కి పంపించేస్తాం. ఇంకో మూడు లక్షలు జమచేయండి. అవి ఇవి అన్ని కలిపి మొత్తం రూ.8 లక్షలతోపాటు రూ.15 లక్షల కారును కూడా ఇచ్చేస్తాం’ అని నమ్మించాడు.

పొలాన్ని తక్కువ ధరకు అమ్మేసి..

మోసగాడి మాటలు నమ్మిన వ్యాపారి మరోసారి నగదు జమచేశాడు. అయినా కారు అం దకపోయేసరికి ఫోన్‌చేయగా.. ‘డబ్బు పంపిం చాం. సంస్థలో ఐటీ సమస్య వచ్చి పేమెంట్‌ నిలిచిపోయింది. మరో రూ.5 లక్షలు జమచేయండి. వీటన్నింటిని రెండు రోజుల్లో మీకు ముట్టజెప్తాం. మీరు చాలా అదృష్టవంతులు సార్‌. మీ డబ్బు మొత్తం మీకు వచ్చేస్తున్నది. డోంట్‌ వర్రీ బీ హ్యాపీ’ అంటూ మరోసారి నమ్మించారు. ఇలా మూడునెలల్లో సదరు వ్యాపారి నుంచి రూ.90 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. డబ్బు తిరిగి రావడంతోపాటు కారు కూడా వస్తున్నదనే అత్యాశకు పోయి పొలాన్ని తక్కువ ధరకు అమ్మేసి రూ.90 లక్షలు జమచేశాడు. చివరకు మోసపోయానని గ్రహించిన సదరు వ్యాపారి రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉండగానే సరిపోదు.. దిమాక్‌ షార్ప్‌గా లేకపోతే సైబర్‌ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కే పరిస్థితులు ఉన్నాయని ప్రతిఒక్కరు గమనించాలి. సైబర్‌ నేరాలు నిత్యం జరుగుతున్నా అప్రమత్తత కొరవడటం, అత్యాశకు పోవడం వంటి కారణాలతో అమాయక చక్రవర్తులు మళ్లీ మళ్లీ మోసపోతున్నారని సైబర్‌క్రైం పోలీసులు చెప్తున్నారు.


logo