బుధవారం 27 మే 2020
Hyderabad - May 22, 2020 , 00:19:37

ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఆసక్తి

ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఆసక్తి

లాక్‌డౌన్‌లోనూ  71.7శాతం

విద్యుత్‌ బిల్లులు చెల్లింపు

గతేడాది బిల్లులే ప్రామాణికం

మణికొండ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో  విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది మార్చి బిల్లులను ప్రామాణికంగా తీసుకుని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు. వేసవికాలం కావడంతో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది.  దీంతో రీడింగ్‌ తీయకపోతే స్లాబ్‌లు మారి గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.  కాగా బిల్లుల చెల్లింపులు వచ్చే నెల రీడింగ్‌ తీసే సమయంలో సవరణ చేస్తామని  అధికారులు పేర్కొంటున్నారు.

లక్షా 53 వేల విద్యుత్‌ కనెక్షన్లు..

ఇబ్రహీంబాగ్‌ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి మున్సిపాలిటీ, మొయినాబాద్‌, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం లక్షా 53వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి.  లక్షా 23వేల గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వ్యవసా యం,వ్యాపార, పరిశ్రమలు ఇతర రంగాలకు సంబంధించి మరో 30వేల వరకు కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ ప్రాంతాల్లో 25.8 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రూ.17 కోట్ల అంచనా..

మొత్తం రూ. 17కోట్ల  అంచనాతో బిల్లులు వసూలు కావాల్సి ఉండగా, మే 16 నాటికి ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ పరిధిలో 80శాతం బిల్లులు చెల్లించారు. అందులో 71.7శాతం బిల్లులు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో 40శాతం, మార్చిలో 54శాతం, మే నాటికి 67శాతం ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లింపులు చేశారన్నారు.

సర్దుబాటు చేస్తాం                 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో  వి నియోగదారులు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌యాప్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌, ఈ సేవ తదితర మార్గాల ద్వారా బిల్లులు చెల్లించాలి.  వ్యాపార వినియోగదారులైతే 2019 ఏప్రిల్‌లో ఎంత బిల్లు వచ్చిందో ఆ బిల్లులో 50శాతం మా త్రమే చెల్లించాలి. లాక్‌డౌన్‌ తర్వాత వచ్చే నెలలో బిల్లులను సర్దుబాటు చేస్తాం. 

   -గోపాలకృష్ణ, డీఈ ,ఇబ్రహీంబాగ్‌ డివిజన్


logo