శుక్రవారం 14 ఆగస్టు 2020
Hyderabad - Jul 12, 2020 , 00:49:02

20 ఏండ్లలో కానిది.. ఇప్పుడైంది

20 ఏండ్లలో కానిది.. ఇప్పుడైంది

ఇందిరాపార్కు-వీఎస్టీ, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి 

రెండు ఉక్కు వంతెనలకు శంకుస్థాపన

పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రసూల్‌పుర ఫ్లైఓవర్‌ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

ఎలివేటెడ్‌ కారిడార్‌తో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

కేసీఆర్‌, కేటీఆర్‌లకు ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గతంలో నగరంలో జనసాంద్రత కలిగిన ప్రాంతంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ ఉండేది. ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్‌ కారిడార్‌ అవసరమని గుర్తించి దాని నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులతో అనేకసార్లు చర్చించాను. 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కృషిచేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఈ మెగా ప్రాజక్టును చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు. ఈ ఉక్కు వంతెనల నిర్మాణంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుంది. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాను.

- జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ నగరాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రూ.426కోట్ల వ్యయంతో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నాలుగు లేన్లు, రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రెండు లేన్లతో నిర్మించనున్న ఉక్కు వంతెనల పనులకు శనివారం మంత్రి కేటీఆర్‌.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్కై వేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన స్థలాలు సేకరించేందుకు కిషన్‌రెడ్డి సహకరించాలని కోరారు. రసూల్‌పురలో చేపట్టిన పనులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఉపయోగించుకునే అంశంలో కిషన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్‌ తెలిపారు. బేగంపేట్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పుర జంక్షన్‌ మీదుగా మెట్రో కారిడార్‌ కింద నుంచి మినిస్టర్‌ రోడ్డువైపు ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదన ఉంది. అయితే ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో రసూల్‌పుర వద్ద కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ టెలీ కమ్యునికేషన్‌ కార్యాలయానికి చెందిన స్థలాన్ని సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ కారణంతో ఫ్లైఓవర్‌ ప్రతిపాదన అమలులో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్ర స్థలాన్ని ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దీని నిర్మాణంతో రసూల్‌పుర జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

కోవిడ్‌ నియంత్రణ చర్యలు భేష్‌..

కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. పారిశుధ్యం, ఎంటమాలజీ విభాగాల ఉద్యోగులు నిర్విరామంగా కష్ట పడుతున్నారని, వారి సేవలకు గుర్తుగా ప్రభుత్వం వారికి మూడు నెలలపాటు ప్రోత్సాహకాలు అందజేసినట్లు గుర్తుచేశారు. ఇందిపార్కు-వీఎస్టీ, రాంనగర్‌-బాగ్‌ అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. 

విశ్వనగరంగా..

సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల మేరకు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా రూ.6 వేల కోట్లతో రోడ్ల విస్తరణ, స్కైవేలు,అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. బెంగళూరు సహా పలు మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారని, నగరానికి ఆ పరిస్థితి రాకుండా చేసే ఉద్దేశంతో ప్రధాన రోడ్లను ఎస్‌ఆర్‌డీపీ కింద సిగ్నల్‌ ఫ్రీ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పది నెలలు పట్టే పనులను రెండు నెలల్లో పూర్తిచేశామన్నారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో కొత్తగా లింకురోడ్లును అభివృద్ధి చేస్తున్నామని, సీఆర్‌ఎంపీ కింద నగరంలోని 719 కిలోమీటర్లమేర ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించామన్నారు. అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయనున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

స్టీల్‌ వంతెనలవిశేషాలు..

రూ. 426 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టీలు ఎలివేటెడ్‌ కారిడార్‌లో భాగంగా ఇందిరాపార్కు-వీఎస్టీ 2.62 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లు, రాంనగర్‌-బాగ్‌లింగంపల్లి రెండు లేన్ల ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఇందులో ఇందిరాపార్కు కారిడార్‌కు రూ.350కోట్లు, రాంనగర్‌ కారిడార్‌కు రూ.76కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo