బుధవారం 30 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 08, 2020 , 23:05:15

ఆగని కరోనా కేసులు..

ఆగని కరోనా కేసులు..

దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 51 కేసులు నమోదయ్యాయి. ఇందులో గాజులరామారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో 23 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురు, షాపూర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రంలో 155 మందికి పరీక్షలు చేయగా 18 మంది, కుత్బుల్లాపూర్‌ ఆరోగ్యకేంద్రంలో 84 మందికి పరీక్షలు చేయగా 17 మంది, సూరారంలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

రామంతాపూర్‌: ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 39 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యకేంద్రం అధికారి తెలిపారు.

వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. ఇందులో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఏడు, యూసుఫ్‌గూడ డివిజన్‌లో ఆరు, బోరబండ డివిజన్‌లో ఐదు, ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలో ఇద్దరికి కరోనా సోకినట్లు డీఎంసీ వివరించారు. 

ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ దవాఖానలో కరోనా నిర్ధారణతో శనివారం 62 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 38 మంది అనుమానిత లక్షణాలతో దవాఖానలో ఉన్నారు. 

ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర నాయక్‌ తెలిపారు. అంతేకాక 52 మంది పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. 

అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలోని అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలో 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

బషీర్‌బాగ్‌: ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీల పరిధిలో మొత్తం 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 8 మందికి పాజిటివ్‌ తేలినట్లు యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు. 

అహ్మద్‌నగర్‌: కరోనా సమయంలో సామాజిక సేవలో నిమగ్నమైన రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పాజిటివ్‌ బారినపడ్డారు. రెడ్‌క్రాస్‌ హైదరాబాద్‌ జిల్లా మీడియా కన్వీనర్‌ సతీశ్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి పార్వతి , సిబ్బంది పర్వతాలుతో పాటు వారి కుటుంబ సభ్యులకూ కరోనా సోకిందని.. ఇందులో సతీశ్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ మామిడి భీమ్‌రెడ్డి తెలిపారు.  

కాప్రా: కాప్రా సర్కిల్‌ పరిధిలోని మల్లాపూర్‌, ఏఎస్‌రావు నగర్‌, చర్లపల్లి, హెచ్‌బీ కాలనీ, నాచారం డివిజన్లలో మొత్తం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ మైత్రేయి తెలిపారు. దీంతో సర్కిల్‌లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 446కు చేరింది. ఇందులో 295 మంది డిశ్చార్జి కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం 143 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభం   

ఎల్బీనగర్‌: చైతన్యపురి డివిజన్‌ కొత్తపేట న్యూ మారుతీనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో నూతనంగా కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. శనివారం న్యూ మారుతీనగర్‌ సంక్షేమ సంఘం కాలనీ ప్రధాన కార్యదర్శి నీరంకి రవి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో తొలి రోజు 18 మంది పరీక్షలు చేయించుకోగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌కృష్ణ, బసవరాజ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo