శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:23:42

ముంపు బాధితులకు ‘నో ఫుడ్‌ వేస్ట్‌' సాయం..!

ముంపు బాధితులకు ‘నో ఫుడ్‌ వేస్ట్‌' సాయం..!

  • ఇంటింటికీ వెళ్లి ఆహార ప్యాకెట్ల పంపిణీ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కష్టకాలంలో ఉన్న వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు మేమున్నామంటూ తమవంతు సేవలందిస్తున్నది ‘నో ఫుడ్‌ వేస్ట్‌' అనే సంస్థ. ఇంటింటికీ వెళ్లి వారి ఆకలిని తీర్చుతున్నది. కుండపోత వర్షాలతో వరద ముంపునకు గురై అవస్థలు పడుతున్న ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నది. 250 వలంటీర్లు, ఆరు వ్యాన్లను సమకూర్చుకొని వారం రోజులుగా 2500 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. వివాహాలు, పార్టీలు ఇతర ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్‌ నుంచి ఫుడ్‌ను సేకరించడంతోపాటు స్వతహాగా సాంబారు రైస్‌, పులిహోరా, పెరుగు అన్నం, చపాతీలను తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు నో ఫుడ్‌ వేస్ట్‌ హైదరాబాద్‌ యూనిట్‌ డైరెక్టర్‌ కె. వెంకట మురళీ తెలిపారు. ప్రతి ఫుడ్‌ ప్యాక్‌లో 400 నుంచి 450 గ్రాముల చొప్పున ఆహారాన్ని అందిస్తున్నారు. వీటితోపాటు దుప్పట్లు, పాలు, రొట్టెలను అందిస్తున్నది. నదీం కాలనీ, సయ్యద్‌నగర్‌, టౌలిచౌకీ, అహ్మద్‌ కాలనీ, బాబా నగర్‌, బోరబండ, అత్తాపూర్‌, కాటేదాన్‌, ముసారాంబాగ్‌, బాపునగర్‌ తదితర ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఆకలితో అలమటించే వారికి 9087790877 నంబర్లలో అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా వెంకట మురళీ తెలిపారు.