బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Jul 25, 2020 , 01:24:36

వివక్ష వద్దు.. సాయం చేద్దాం..!

వివక్ష వద్దు.. సాయం చేద్దాం..!

వారికి తాత్కాలిక అనారోగ్యమే.. నేరస్తుల్లా చూడకండి!!

బాగోగులు తెలుసుకొని.. బాధితుల్లో ధైర్యం నింపండి

సహాయమందించేందుకు మే రెడీ

రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా బారిన పడిన వారిని ఎవరైనా అవమాన పరిచినా.., విభేదించినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ హెచ్చరించారు. కరోనా సోకిన వారికి ధైర్యం చెబుతూ వారు త్వరగా కోలుకునే విధంగా మానవీయ కోణంలో సహకరించాలని సూచించారు. బాధితుల కోసం అంబులెన్స్‌లు, వైద్య బృందం వచ్చినప్పుడు ఫొటోలు, వీడియోలు తీయవద్దని, అది కరోనా సోకిన వారిని ఆందోళనకు గురిచేస్తుందన్నారు. కరోనా సోకిన వారిని మీ బాల్కానీలో నుంచి పలుకరిస్తూ ధైర్యం చెప్పాలన్నారు. 

మీకు కూడా రావచ్చు..!

కరోనా వైరస్‌ విస్తరిస్తున్నది.. మీరు బాధితుల పట్ల వివక్ష చూపించవద్దు. మీకు కరోనా రావచ్చు.. అప్పుడు అంబులెన్స్‌, వైద్యసిబ్బంది మీ ఇంటివద్దకు వచ్చే అవకాశం ఉంటుంది.. అప్పుడు ఇరుగుపొరుగు మిమ్మల్నీ అలానే చూస్తారు.. అనే విషయాన్ని మరిచిపోవద్దని సీపీ తెలిపారు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరూ కరోనా సోకిన వారికి సహాయం చేయాలే తప్పా.. వివక్షతో చూడకూడదన్నారు. తాత్కాలికంగా అనారోగ్యానికి గురయ్యారే తప్పా.. క్రిమినల్స్‌ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇరుగుపొరుగువారితో ఇబ్బందులు ఎదురైతే.. తమ దృష్టికి తేవాలని.. వారికి పోలీసు శాఖనుంచి తప్పకుండా సహకారం అందజేస్తామన్నారు. రాచకొండ వాట్సాప్‌ నంబర్‌ 9490617111, డయల్‌ 100 సంప్రదించాలని సీపీ సూచించారు.logo