ఆదివారం 09 ఆగస్టు 2020
Hyderabad - Jul 02, 2020 , 00:08:07

31 వరకూ రాత్రి కర్ఫ్యూ

31 వరకూ రాత్రి కర్ఫ్యూ

కంటైన్మెంట్‌లలో 36 ప్రాంతాలు, 3,800 ఇండ్లు

ఇండ్ల వద్దకే సరుకులు

తొమ్మిదిన్నరకు అన్నీ బంద్‌

కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు పాతవే అమలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసే వరకు నగరంలో ప్రస్తుతమున్న 36 కంటైన్మెంట్‌ జోన్లలో కట్టడి చర్యలు యథావిధిగా కొనసాగనున్నాయి. అలాగే 3800 కంటైన్మెంట్‌ ఇండ్లపై కూడా ఆంక్షలు అమలులోఉంటాయి. రాత్రి కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం తీసుకునే కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు గతంలో జారీ చేసిన నిబంధనలే కొనసాగుతాయి.

 మరో నెల పొడిగింపు...

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాల గడువు జూన్‌ 30వ తేదీతో పూర్తికావడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కర్ఫ్యూ నిబంధనలను ఈనెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం, లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలో రాత్రి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను యథావిధిగా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దవాఖానలు, మెడికల్‌ షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నీ రాత్రి తొమ్మిదిన్నరకు మూసివేయాలని, రైలు, బస్సు, విమానాల్లో ప్రయాణించే వారికి, అత్యవసర పనులకు సంబంధించిన వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పగటిపూట ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ రాత్రి కర్ఫ్యూ మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని జూలై చివరి వరకూ కొనసాగించనున్నారు. పరిశ్రమల్లో షిఫ్టుల వారీగా పనిచేసే సిబ్బంది, రహదారుల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పనుల్లో ఉండే కార్మికుల ను మాత్రమే కర్ఫ్యూ సమయంలో అనుమతిస్తారు. 

కంటైన్మెంట్‌ జోన్లలో....

కంటైన్మెంట్‌ జోన్లలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు అలాగే ఉంటాయి.  నగరంలో మొత్తం 35 కంటైన్మెంట్‌  జోన్లు ఉండగా... 3,800 ఇండ్లు కట్టడిలో ఉన్నాయి.  అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్‌   జోన్లుగా పరిగణిస్తుండగా.. ఏదైనా ఒక ఇంట్లో పాజిటివ్‌ కేసులు నమోదైతే కంటైన్మెంట్‌ హోమ్‌గా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్‌  జోన్లలో వారం పాటు వ్యాపార కార్యకలాపాలు, రాకపోకలను నిషేధిస్తున్నారు. కంటైన్మెంట్‌ హోమ్‌లలో ఉన్న వారిని  వారం పాటు ఇండ్లకే పరిమితం చేస్తూ  వారికి సరుకులు అందిస్తున్నారు.logo