సోమవారం 06 జూలై 2020
Hyderabad - May 28, 2020 , 03:08:14

రూ.5 కోట్ల వ్యయంతో చెత్త తరలింపులో ఆధునికత

రూ.5 కోట్ల వ్యయంతో చెత్త తరలింపులో ఆధునికత

కంప్రెషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెంటర్‌

మొదటగా బీఎన్‌రెడ్డినగర్‌ బతుకమ్మకుంటలో ప్రయోగం

చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అటు ప్రభుత్వం, ఇటు జీహెచ్‌ఎంసీ నిరంతరం కృషి చేస్తున్నాయి. అందుకనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తున్నాయి. పూణే, కలకత్తా తరహాలో చెత్త సేకరణ, తరలింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. సుమారు రూ.5కోట్లతో ప్లాంటును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సేకరించిన చెత్త నుంచి తడిని తీసి పొడిని డంపింగ్‌ కేంద్రానికి తరలిస్తారు. ఇందుకుగాను నగరంలో మోడల్‌గా బీఎన్‌రెడ్డినగర్‌లోని బతుకమ్మ కుంటను ఎంచుకున్నారు. ఇక్కడ సక్సెస్‌ అయితే నగరంలోని మరో నాలుగైదు చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.      -  వనస్థలిపురం

ప్రస్తుత పరిస్థితి ఇలా...

వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్లలో ఆటో, రిక్షాల్లో సేకరించిన చెత్తను బతుకమ్మ కుంట వద్ద ఉన్న కుండీల్లో వేస్తున్నారు. అవి నిండిన తర్వాత సుమారు 10 లారీల చెత్తను లారీల్లో జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు ప్రతి రోజూ తీసుకెళ్తారు. కుండీలు నిండి చెత్త కిందపడి కుప్పలుగా పేరుకుపోతున్నది. దానికితోడు హోటళ్లు, పలు దుకాణదారులు చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పడేసి వెళ్తున్నారు. దీంతో కుక్కలు, పందులు స్వైర విహారం చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాలనీల్లో గాలికి కొట్టుకువచ్చిన చెత్త చేరి దుర్వాసనను వెదజల్లుతున్నది. నగరంలో ఉన్న అన్ని తరలింపు కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. వాటికి శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నది. దీని ద్వా రా ఆ ప్రాంతంలో చెత్త కనిపించకుండా చేయనున్నారు.

పచ్చని చెట్లతో సుందరీకరణ..

 ఈ ప్లాంటు నిర్మించిన అనంతరం కాలుష్యం, విషవాయువులు వస్తాయని స్థానికులు అపోహ పడుతూ అడ్డుపడుతున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పర్యావరణం, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్లాంటు చుట్టూ పచ్చని చెట్లను పెంచడంతోపాటు గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తామంటున్నారు. ప్రజలు అపోహలకు గురికావద్దని అధికారులు కోరుతున్నారు. 

ప్రజలకు అవగాహన అవసరం

ఈ ప్లాంటు ఏర్పాటుపై ప్రజల్లో చాలా అపోహలు ఉ న్నాయి. పర్మినెంట్‌గా చెత్త డంపింగ్‌ కేంద్రంగా మారుస్తారని, విషవాయువులు వస్తాయనే వాదనలతో వ్యతిరేకిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇక్కడ ప్రహరీ, గార్డెన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నించగా ప్రజలు అడ్డుకున్నారు. దాని వలన చెత్త విచ్చల విడిగా చేరింది. అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహ న కల్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

గార్బెజ్‌ కంప్రెషన్‌ మిషన్ల సహాయంతో..

బతుకమ్మ కుంట సమీపంలో గార్బెజ్‌ కంప్రెషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాంటును రూ.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. 400ల గజాల స్థలంలో షెడ్డును నిర్మిస్తారు. అందులో మూడు గార్బెజ్‌ కంప్రెషన్‌ మిషన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆటో, రిక్షాల్లో సేకరించిన చెత్తను తీసుకువచ్చి కంప్రెషన్‌ మిషన్‌లో వేస్తారు. ఆ మిషన్లు చెత్తను వత్తి అందులో ఉన్న నీటిని తీసేస్తుంది. ఆ మురుగు నీటిని డ్రైనేజీలోకి పంపిస్తారు. పొడిగా మారిన చెత్త మిషన్‌ నుంచి కుండీలోకి వెళ్తుంది. కుండీలు నిండిన వెంటనే లారీల ద్వారా వాటిని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. 

పర్యావరణం, ప్రజారోగ్యమే లక్ష్యం

కంప్రెషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెంటర్‌ వలన ప్రజలకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్వానంగా ఉంది. దీనిని నిర్మించడం ద్వారా చెత్త బయట కనిపించకుండా చేస్తాం. చెత్తను కంప్రెస్‌ చేసి మురుగు నీటిని తొలగించి, పొడి చెత్తను తరలిస్తాం. దీని వలన ఎలాంటి సమస్యలూ రావు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చెత్త నిర్వహణను చేపడుతాము. ప్రజలకు అవగాహన కల్పించి ప్లాంటును నిరిస్తాం.

-మారుతీ దివాకర్‌,  జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌


logo