శనివారం 30 మే 2020
Hyderabad - May 23, 2020 , 01:42:13

ఇంటర్‌ లాక్‌ బ్రిక్స్‌తో క్యూరింగ్‌ లేకుండా ఇల్లు కట్టొచ్చు...

ఇంటర్‌ లాక్‌ బ్రిక్స్‌తో క్యూరింగ్‌ లేకుండా ఇల్లు కట్టొచ్చు...

క్యూరింగ్‌ లేకుండా ఇల్లు కట్టడం సాధ్యమైనా అంటే.. సాధ్యమే అంటున్నాడు మల్కాజిగిరికి చెందిన విజయవర్ధన్‌యాదవ్‌. తెలంగాణలోనే తొలిసారిగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్‌ లాకింగ్‌ బ్రిక్స్‌ తయారీకి శ్రీకారం చుట్టాడు. తక్కువ ఖర్చుతో గృహాల నిర్మాణానికి ఈ తరహా ఇటుకలు ఎంతో దోహదం చేస్తాయంటున్నాడు. న్యూజీలాండ్‌లో మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తున్న ఇతను లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకొని.. ఈ బ్రిక్స్‌ తయారీలో నిమగ్నమయ్యాడు. తనతో పాటు మరో 50మందికి ఉపాధిని కల్పిస్తూ...నిర్మాణ రంగంలో కొత్త ఒరవడి స్పష్టిస్తున్నాడు. - నేరేడ్‌మెట్‌

డబ్బులు ఆదా.. కలిసొచ్చే సమయం... 

ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఇంటర్‌ లాకింగ్‌ టెక్నాలజీ బ్రిక్స్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. భారత్‌లో  కూడా వివిధ రాష్ర్టాల్లో ఇవి తయారవుతున్నాయి. అయితే మన  రాష్ట్రంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాడు విజయ్‌వర్ధన్‌యాదవ్‌. మేడ్చల్‌ జిల్లా కీసర ప్రాంతంలో  1.5 ఎకరాల్లో సొంతంగా టఫీ పేరిట కంపెనీ పెట్టి.. ఈ తరహా ఇటుకలను తయారు చేస్తున్నాడు. ఇండ్ల నిర్మాణంలో వంద సాధారణ ఇటుకలకు రూ. 1200 ఖర్చు వస్తుంది. అదే లాకింగ్‌ బ్రిక్స్‌ వందకు బదులు 25 వాడితే సరిపోతుంది. వ్యయం కూడా మాములు వాటితో పోల్చుకుంటే సుమారు రూ.975 అవుతుంది. వంద గజాల్లో ఇల్లు నిర్మిస్తే సాధారణ ఇటుకలతో ప్లాస్టరింగ్‌తో కలిసి రూ.4.50 లక్షలు ఖర్చయితే.. ఈ లాకింగ్‌ బ్రిక్స్‌తో ప్లాస్టరింగ్‌ చేయకుండానే.. రూ.2.27 లక్షలు మాత్రమే ఖర్చు వస్తుంది. పైగా పది మంది చేసే పనిని నలుగురితో చేయవచ్చు. ఫలితంగా డబ్బులు ఆదాతో పాటు ఏడాది పట్టే ఇంటి నిర్మాణాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసేందుకు ఆస్కారముంటుంది. అంతేకాకుండా నిర్మించే భవనానికి వాటర్‌ క్యూరింగ్‌ అవసరంలేదు. ఎందుకంటే ఈ బ్రిక్స్‌కు ప్లాంట్‌లోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తారు.

ప్రత్యేక యంత్రాలు కొనుగోలు చేశాం 

ఈ ఇంటర్‌ లాకింగ్‌ బ్రిక్స్‌ తయారీ కోసం కేరళ రాష్ట్రంలో ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఈ తరహా ఇటుకల కోసం ప్రత్యేక యంత్రాలను కొనుగోలు  చేశాం. రోజుకు 60వేల నుంచి 70వేల ఇటుకలను తయారీ చేస్తున్నాం. వీటిని ఉపయోగిస్తే ఖర్చు ఆదా అవడంతో పాటు నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. మల్కాజిగిరి, కొంపల్లి, సైనిక్‌పురి ప్రాంతంలో ఈ ఇంటర్‌ లాకింగ్‌ బ్రిక్స్‌తో పలు నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ ఇటుకలతో పోల్చితే ఇవి ఎన్నో రెట్లు ప్రయోజనకరంగా ఉంటుంది.  నిర్మాణదారుల్లో ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన వస్తున్నది. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లోని వివిధ జిల్లాల్లో యూనిట్లు ప్రారంభిస్తున్నాం. -బి. విజయవర్ధన్‌యాదవ్‌ 


logo