మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:23:43

ప్రజా సేవలో.. నూతన ఎస్‌ఐలు

ప్రజా సేవలో.. నూతన ఎస్‌ఐలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసు విభాగంలో ఎక్కువ సంఖ్య లో మహిళా ఎస్సైలు నియామకమయ్యారని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 203 మంది ప్రొబేషనరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(సివిల్‌) హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవా రం నగర పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన ఎస్సైలకు సీపీ ఘన స్వాగతం పలికి, వారికి దిశా నిర్దేశం చేశారు. తన 30 ఏండ్ల పోలీసు జీవితానికి సంబంధించిన అనుభవాలను సీపీ... నూతన ఎస్సైలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీపీ పలు అంశాలపై కొత్త ఎస్సైలకు వివరించారు. కొత్త ఎస్సైల్లో 140 మంది పురుషులు, 63 మంది మహిళలు ఉన్నారు. ఈ సమావేశంలో సీటీసీ అదనపు సీపీ సునీతారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 • సీపీ మాటల్లో...

  • కొత్తగా నియామకమైన ఎస్సైలతో రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌ నగరానికి కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చినట్లుగా ఉందన్నారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి అన్నారు.
  • అందరూ మానసికంగా, శారీరకంగా కష్టపడి పోటీ పరీక్షల్లో పాసై, 9 నెలల పాటు పోలీసు అకాడమీ, జిల్లాలు, గ్రేహౌండ్స్‌లో శిక్షణ పొందిన మీరంతా.. ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ పోలీసింగ్‌లో విధులు చేపడుతున్నారన్నారు.
  • ఉద్యోగం సంపాదించడం, బాధ్యతలు చేపడుతుండటంతో మీకు ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు, కలలు... ఎన్నో విషయాలు మీ మైండ్‌లో నిండి ఉంటాయి. అ లాంటివే మీ కుటుంబ సభ్యుల్లోనూ ఉంటాయన్నారు.
  • ఖాకీ డ్రెస్‌ వేసుకున్న మన నుంచి ప్రజలు వారి వారి అవసరాల కోసం ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తారని, ప్రజా సేవలో అందరూ ముందుండి, పోలీసు విభాగం ప్రతిష్టను మరింతగా పెంచాలన్నారు.
  • జీవితంలో వందలాది పండుగలు, వేడుకలు వస్తాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేడుకలు జరుపుకుంటారు. కానీ మీరు విధి నిర్వహణలోఉంటారు. విధి నిర్వహణలో ఉంటూ ఆయా వేడుకలను మనకు అనుకూలంగా మలుచుకొని అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలని, అలాంటి అలవాట్లు చేసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉద్యోగం చేస్తారన్నారు. అలాంటి అలవాట్లు చేసుకోకపోతే ఉత్సాహంగా ఉద్యోగం చేయకపోవడం, ఉద్యోగం భారంగా మారుతుందన్నారు. ప్రజల సంతోషాన్ని మన సంతోషంగా చేసుకొని విధులు నిర్వహించే అలవాట్లను వెంటనే నేర్చుకోవాలని.. అప్పుడే  ఉద్యోగం, జీవితం రెండింట్లో అందమైన ప్రయాణం జరుగుతుందని సూచించారు.
  • తన 30 ఏండ్ల అనుభవంలో పోలీసు శాఖలో సేవలు అందించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. 
  • ప్రతి పోలీసు అధికారి పౌరుడే. ప్రతి పౌరుడు పోలీసు అధికారనే అనే విధానాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ సూక్తిని మీరు మదిలో దాచుకోవడంతో భవిష్యత్తులో ఉత్తమ పోలీసు అధికారవుతారన్నారు.
  • మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో వెయ్యి మంది క్రిమినల్స్‌ తప్పించుకున్నా, ఒక్క అమాయకుడు కూడా శిక్షించబడొద్దనే విధానాన్ని గుర్తించుకోవాలన్నారు.