బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 00:21:33

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు కొత్త కళ

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు కొత్త కళ

  • చెరువుల్లో గుర్రపుడెక్క తొలిగింపు
  • తటాకాలకు కొత్తకళ
  • సత్ఫలితాలిస్తున్న  ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్లు 
  • మరో ఆరు యంత్రాల దిగుమతికి సన్నాహాలు
  • చెరువుల సంరక్షణకు ముమ్మర చర్యలు

హైదరాబాద్ : హెచ్‌ఎండీఏ పరిధిలోని  చెరువులు కొత్త కళను సంతరించుకున్నాయి. సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి.. గుర్రపుడెక్క పేరుకుపోయి.. అభివృద్ధికి నోచుకోక.. అధ్వానంగా మారిన తటాకాలు.. నేడు అందంగా ముస్తాబయ్యాయి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన చెరువులకు పూర్వవైభవం  తీసుకురావాలని  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగింది. అభివృద్ధి పనులతో అందమైన జలాశయాలుగా తీర్చిదిద్దుతున్నది. సుమారు 10 చెరువుల్లో గుర్రపుడెక్కను తొలిగించింది.  టన్నుల కొద్దిగా పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలిగింపునకు  ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ యంత్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో కొత్తగా మరో ఆరు యంత్రాల దిగుమతికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది కాలంగా గుర్రపు డెక్కను తొలిగించేందుకు రెండు యంత్రాలతో శుద్ధి పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాంపల్లి (ఎఫ్‌టీఎల్‌ విస్తీర్ణం 127), కుంట్లూరు (102.173), అన్నారయన్‌ చెరువు/నాగారం (32.700), పీర్జాదిగూడ పెద్ద చెరువు (34.113), మీర్‌పేట చెరువు (62.51), చందన్‌చెరువు,  తలాబ్‌ చెరువుల్లో గుర్రపు డెక్కను తొలిగించి అందంగా తీర్చిదిద్దారు.

ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌తో..

గుర్రపు డెక్కను తొలిగించడంలో ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ (ఎఫ్‌టీసీ) మెరుగైన ఫలితాలిస్తున్నది.  ఈ అధునాతన యంత్రంతో  శుద్ధి విధానం తేలికగా మారింది. 12 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో  గుర్రపుడెక్కను ఒకే సారి తొలిగిస్తున్నది. దాన్ని ట్రాష్‌ కలెక్టర్‌లోనే స్టోర్‌ చేసుకుని  ఒడ్డుకు చేర్చుతున్నది.  5 టన్నుల వరకు గుర్రపుడెక్కను స్టోర్‌ చేసుకునే సామర్థ్యం ఈ యంత్రానికి ఉన్నది. ఇప్పటికే వందల టన్నుల మేర గుర్రపుడెక్కను తొలిగించి దాదాపు పది చెరువులను సరికొత్తగా తీర్చిదిద్దారు.


logo