శనివారం 30 మే 2020
Hyderabad - May 21, 2020 , 01:19:46

‘స్వచ్ఛ హుస్సేన్‌సాగరే’ లక్ష్యం

‘స్వచ్ఛ హుస్సేన్‌సాగరే’ లక్ష్యం

హైదరాబాద్ : మురుగునీటి నిర్వహణలో జలమండలి ఎప్పటికప్పుడు నూతన విధానాల వైపు అడుగులు వేస్తున్నది. సాధారణంగా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించాలంటే దాదాపుగా ఐదెకరాల స్థలం అవసరం ఉంటుంది. అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒకేచోట ఎకరాల కొద్ది స్థలం దొరకాలంటే కష్టసాధ్యం. ఈ నేపథ్యంలోనే తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యంతో ఉండే వర్టికల్‌ ఎస్టీపీ(మురుగునీటి శుద్ధి) కేంద్ర నిర్మాణం వైపు కసరత్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి నాలాపై వర్టికల్‌ ఎస్టీపీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల జలమండలి అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రేటర్‌లో తొలి విడుతగా వర్టికల్‌ ఎస్టీపీ నిర్మాణం వైపు జలమండలి కసరత్తు ప్రారంభించింది. మల్టీస్టోరేజ్‌ బిల్డింగ్‌ తరహాలో నిర్మాణం జరుగడం.. మురుగునీటి వ్యర్థాలను దశలవారీగా శుద్ధి చేస్తూ కిందకు స్వచ్ఛ జలాలను మళ్లించేందుకు వీలుగా వర్టికల్‌ ఎస్టీపీ పని చేయనున్నది. తక్కువ స్థలంలో మెరుగైన శుద్ధి విధానం ఉండడంతో ఈ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వర్టికల్‌ ఎస్టీపీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని జలమండలి అధికారులు భావిస్తున్నారు. 

‘స్వచ్ఛ హుస్సేన్‌సాగరే’ లక్ష్యం 

జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు దాదాపు 9 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న కూకట్‌పల్లి నాలా ద్వారా రోజూ దాదాపుగా 250 ఎంఎల్‌డీల మేర మురుగునీరు వస్తున్నది. ఇందులో 60-80ఎంఎల్‌డీ మేర పైపులైన్‌ ద్వారా కాకుండా నేరుగా సాగర్‌లోకి వచ్చి చేరి జలాలను కలుషితం చేస్తున్నాయి. అయితే స్వచ్ఛ హుస్సేన్‌సాగర్‌గా మార్చే క్రమంలో రంగధాముని చెరువు, ఖాజాగూడ వద్ద రెండు ఎస్టీపీలు నిర్వహణలో ఉండగా, నూతనంగా ఫాక్స్‌ సాగర్‌, శివాలయనగర్‌, పరికిచెరువు, అంబీర్‌చెరువు(ప్రగతినగర్‌), మల్లమ్మకుంట చెరువు, ముళ్లకత్వ చెరువు, కాముని చెరువు, ఐడీపీఎల్‌ గాంధీనగర్‌, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌, ఫత్తేనగర్‌ ప్రాంతాల్లో నూతన ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే జలమండలి సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీంతోపాటు ఖైరతాబాద్‌ వద్ద ఉన్న ఎస్టీపీ వద్ద అదనంగా మురుగునీటి శుద్ధిని ఏర్పాటు చేసేందుకు నూతన ఎస్టీపీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి అటు హుస్సేన్‌సాగర్‌, ఇటు మూసీ నదిని పరిరక్షించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


logo