చందానగర్‌కు చెందిన ప్రవళిక ఓ గృహిణి. ఇటీవలే ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. కానీ స్థలాభావం వల్ల గదుల్లో వారి వద్ద ఉన్న ఫర్నీచర్ ఏర్పాటు చేయడం కుదరలేదు. దీంతో ఆ ఫర్నీచర్‌ను విక్రయించి.. మల్టీపర్పస్ ఫర్నీచర్‌ను ఆశ్రయించారు. ఇప్పుడు వారికి నచ్చిన ఫర్నీచర్ అంతా ఆఫ్లాట్లో అందంగా అమర్చుకున్నారు.
కూకట్‌పల్లికి చెందిన ప్రమోద్ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొత్తగా పెళ్లి చేసుకుని వారి బడ్జెట్లోనే ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. కొంచెం ఇరుకుగా ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఇష్టమైన ఫర్నీచర్ పెట్టుకోలేకపోతున్నామని ఆవేదన చెందాడు. కానీ మల్టీపర్పస్ ఫర్నీచర్‌తో అతడి ఆశ నెరవేరింది.
సొంతింట్లో అన్ని సౌలతులు ఉండాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది. రూ. లక్షలు పెట్టి కొన్న ఇంట్లో నచ్చిన వస్తువులను అమర్చుకోవడానికి స్థలం లేకపోతే ఆ వెలితి తీర్చలేనిది. ఫర్నీచర్ లేని ఇల్లు బోసిపోయి కనిపిస్తుంది. అలా అని ఒక గదిలో బెడ్ అమర్చుకుంటే ఉన్న స్థలమంతా అదే ఆక్రమిస్తుంది. ఇక ఇంటికి గెస్ట్లొస్తే అంతే సంగతులు. ఇలాంటి వారి కోసమే సరికొత్తగా మల్టీపర్పస్ ఫర్నీచర్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఒక వస్తువుతో అనేక అవసరాలు తీర్చే సామగ్రిని అపార్ట్‌మెంట్‌వాసుల కోసం పలు రకాల కంపెనీలు తీసుకొచ్చాయి.
తగ్గిపోతున్న స్థలంతో మల్టీపర్పస్ ఫర్నీచర్ వినియోగం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫర్నీచర్ మాల్స్ వెలుస్తున్నాయి. విభిన్న రకాల డిజైన్లతో మార్కెట్లోకి వస్తున్న ఈ ఫర్నీచర్… అవసరాలు తీర్చడంతో పాటు ఇంటికే అందం తీసుకొస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేసిన ఫర్నీచర్ ఇప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
సంగీత ప్రియులకు హోం థియేటర్ యూనిట్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇందులో బార్ యూనిట్ కోసం స్థలం ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ సౌండ్ సిస్టం ఉటుంది. దీనికి రెస్ట్ చైర్ అమర్చి ఉంటుంది. రెస్ట్ తీసుకుంటూ సంగీతంలో తేలిపోవచ్చు.
డ్రెస్సింగ్ టేబుల్ బెడ్రూమ్కు సరిగ్గా సెట్అయ్యే సామగ్రి. అద్దం వెనుకాల చాలా ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్‌లో కాస్మొటిక్స్, గాజులు, ఇయర్రింగ్స్ పెట్టుకోవచ్చు.
పిల్లల గది కోసం బంక్ బెడ్ కొనుగోలు చేయొచ్చు. ఈ బెడ్లో ఫిట్ ఇన్ వార్డ్రోల్ కూడా ఉంటుంది. అందులో పిల్లల బట్టలు పెట్టుకోవచ్చు. దీని చివరన స్టడీ టేబుల్ కూడా ఉంటుది. అవసరమున్నప్పుడు వాడుకోవచ్చు. అనంతరం మూసివేయొచ్చు.
పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవాళ్లు బుక్ షెల్టర్‌ను కొనుగోలు చేయొచ్చు. పల్చని బుక్‌షెల్ఫ్‌లో ఇన్‌బిల్ట్ స్టడీ టేబుల్ ఉంటుంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరవచ్చు. దాంతో పాటే కాఫీ టేబుల్ ఉంటుంది. అలసిపోతే అక్కడే కూర్చొని టీ, కాఫీలు ఆస్వాదించవచ్చు. ఈ బుక్షెల్ఫ్ను కార్నర్ టేబుల్గాను వినియోగించవచ్చు.
మా ఫ్లాట్‌లో సరిపడా స్థలం లేక పాత ఫర్నీచర్‌ను అమ్మేశాం. ఇప్పుడు మల్టీపర్పస్ ఫర్నీచర్ కొనుగోలు చేశాం. కొత్తగా తీసుకున్న ఫుట్స్టూ ఫర్నీచర్‌తో గెస్ట్‌లు ఇంటికొస్తే కూర్చోవచ్చు…అవసరమైతే నిద్రించవచ్చు. ఉన్న స్థలంలోనే ఎంతో కంఫర్ట్‌గా ఉంది.- రవళి, గృహిణి
మార్కెట్లో అనేక రకాల్లో విభిన్న డిజైన్‌లో మల్టీపర్పస్ ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. మేం కాఫీ టేబుల్ కొనుగోలు చేశాం. వర్క్ ఫ్రం హోం సమయంలో ఈ ఫర్నీచర్ ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి ఉపయోగపడింది. ఆకలేస్తే డైనింగ్ టేబుల్గాను, వర్క్ అయిపోతే ఇంట్లో సెంట్రల్ టేబుల్‌గానూ
వినియోగించుకున్నాం. – మధు, ఐటీ ఉద్యోగి
సోఫా బెడ్‌ల్లో ఇప్పుడు మరిన్ని ఎక్స్టెన్షన్లు వచ్చాయి. సాధారణంగా కుటుంబంలో ఒకరికి సోఫా మరొకరికి దివాన్ ఇలా వేర్వేరుగా కొనాలని ఉంటుంది. అయితే వీటిని విడివిడిగా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టే స్థలం ఉండదు. అందుకే వారిద్దరి అవసరాలు తీర్చేల సోఫాకంబెడ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని రోజంతా సోఫాలాగా, రాత్రిపూట ఒక వ్యక్తి నింద్రించే సింగిల్ బెడ్గానూ మార్చుకోవచ్చు. ఇద్దరు నిద్రపోయే విధంగా డబుల్ బెడ్ కూడా తయారుచేయొచ్చు. వీటి లోపల వస్తువులు పెట్టుకునేందుకు స్థలం ఉంటుంది. దివాన్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ సోఫాను లివింగ్ రూంలో కూడా పెట్టుకోవచ్చు.
చాలా మందికి డైనింగ్ టేబుల్ కొనాలని ఉంటుంది. కానీ స్థలం లేక దాని జోలికి వెళ్లరు. అలాంటప్పుడు గోడలతో అటాచ్ అయ్యే బెడ్‌ను కొంటే బాగుంటుందని చెబుతున్నారు. అవసరమైనప్పుడు తెరవలగలిగే బెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిపై మరొక అటాచ్మెంట్ ఉంటుంది. దీన్ని తెరవగానే అది డైనింగ్ టేబుల్‌గా మారుతుంది.
ఒకటే గది ఉంటే దానిని రెండు భాగాలుగా విడదీయవచ్చు. టీవీ క్యాబినెట్ తీసుకోవడం మంచిది. సన్నటి క్యాబినెట్ కొని గది మధ్యలో పెడితే… రెండు గదులుగా వినియోగించుకోవచ్చు. ఓవైపు కిచెన్..మరోవైపు టీవీ రూమ్‌గా ఉపయోగపడుతుంది.