శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:44:07

బిడ్డను అమ్మేశారు..

బిడ్డను అమ్మేశారు..

  • గర్భిణిగా ఉన్నప్పుడే అమ్మకానికి ఒప్పందం..
  • 5 నెలల తర్వాత మళ్లీ కావాలని.. పోలీసులను ఆశ్రయించిన కుటుంబం

ఉప్పల్‌ : పేదరికం.. బిడ్డను అమ్మకానికి పెట్టేలా చేసింది.. దీనికితోడు ఆడపిల్లలు పుట్టడంతో పుట్టే మరో బిడ్డ కూడా తమకు భారం అవుతుందని భావించి.. పుట్టకముందే బిడ్డను అమ్మకానికి పెట్టారు... లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని బిడ్డను పురిటిలోనే పిల్లలు లేని ఓ కుటుంబానికి అప్పగించారు... అయితే.. ఐదు నెలల తర్వాత తిరిగి తమ బిడ్డ తమకే కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన మీన, వెంకటేశ్‌లు దంపతులు నాచారంలోని అంబేద్కర్‌నగర్‌కు ఉపాధి కోసం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు చనిపోయింది. అయి తే.. మీన మరోసారి గర్భం దాల్చింది. ఈసారి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అయితే.. ఆమెను పోషించలేమని అనుకుని..బిడ్డను అమ్ముతామని తమ ఇంటివద్ద ఉండే జానకిని సంప్రదించింది. జానకి తనకు తెలిసిన పిల్లలులేని రాజేశ్‌ అనే మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని  సంప్రదించింది. ఈ మేరకు బిడ్డను ఇవ్వడానికి మీన దంపతులు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఎస్‌ఐ దవాఖాన నాచారంలో జూన్‌ 19న మీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒప్పందం ప్రకారం ఆ బిడ్డను రాజేశ్‌ దంపతులకు అప్పగించింది. కాగా.. అక్టోబర్‌ 29 రాత్రి తన బిడ్డను తిరిగి అప్పగించేలా చూడాలని నాచారం పోలీసులను మీన ఆశ్రయించింది.  ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువును చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించారు. 

ఈఎస్‌ఐ దవాఖాన సిబ్బంది పాత్రపై విచారణ ?

నాచారంలోని ఈఎస్‌ఐ దవాఖానలో వైద్యం అందాలంటే తప్పనిసరిగా ఈఎస్‌ఐ కార్డు ఉండాలి. అయితే మీన, వెంకటేశ్‌లకు ఈఎస్‌ఐ కార్డు లేదు.  రాజేశ్‌కు ఉన్న ఈఎస్‌ఐ కార్డు ద్వారా మీనకు ఈఎస్‌ఐలో వైద్యసేవలు అందించినట్లు తెలుస్తుంది. రాజేశ్‌ సతీమణిగా పేరు చెప్పి వైద్యం చేసినట్లు తెలుస్తుంది.  డెలివరీ చేయడంపై ఈఎస్‌ఐలోని సిబ్బంది పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు.