వైరస్..అదొక దయ్యం. గతంలో స్వైన్ ఫ్లూ, ఎబోలా వంటి వాటితో ప్రపంచాన్ని నాశనం చేయాలని పూనుకుంది. కానీ శాస్త్రవేత్తలు, వైద్యులు ఆ వైరస్ దయ్యాన్ని తరిమేశారు. సాంకేతికత సాయంతో తొక్కిపెట్టారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు వైరస్ శక్తిని నిర్వీర్యం చేసేశాయి.
అది 2020. అప్పటి వరకు వైరస్‌పై విజయం సాధించిన మానవుని ఆవిష్కరణలపై ఆ వైరస్ దయ్యానికి తీవ్ర కోపం వచ్చింది. ఈ మానవ జాతిని మొత్తం నాశనం చేసే శక్తి కోసం ఓ రోజు తన రక్తంతో హోమం చేసింది. ఆ వైరస్ దయ్యం తపస్సుకు దయ్యాల దేవత ప్రత్యక్షమవుతుంది.
ఇలా చిట్టిచిట్టి డైలాగులు.. క్లిష్ట సబ్జెక్టును మెదడులోకి సలుభంగా చొప్పించే ఆసక్తికర మాటలు.. కార్టూన్ తరహాలో యానిమేషన్ జోడింపు.. వెరసి భయానక వైరస్ కరోనాపై విస్తృత కంటెంట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు క్రియేటర్లు. వైరస్ సృష్టి.. వ్యాప్తి.. దాడి సమాచారాన్ని యూట్యూబ్ వేదికగా మానవ మస్తిష్కంలోకి సులభంగా ఎక్కిస్తున్నారు. పిల్లలను విపరీతంగా ఆకట్టుకునే సింగం, పోకేమాన్, డిస్నీ కార్టూన్ తరహాలో కరోనాపై కూడా యానిమేషన్ సృష్టించి కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. సాంకేతికతతో మహమ్మారిపై అందరిని అప్రమత్తం చేసేలా సందేశాన్నిస్తున్నారు. ఆలోచన రేకెత్తించే వీడియోలను రూపొందించి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ తదితర వెబ్ మీడియా, యాప్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ మొబైల్ చూసినా కరోనా కంటెంట్‌తో నిండి ఉంటుంది. అంతేకాదు ఆ కంటెంట్‌కు కోట్లల్లో వ్యూస్ రావడం విశేషం.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడం చాలా ముఖ్యం. వీడియోల రూపంలో చెబితే అది వారికి బాగా అర్థమవుతుంది. చిన్నారులకు అయితే కార్టూన్ల రూపంలో చెప్పాలి. కరోనాపై యానిమేషన్ రూపంలో చేసిన వీడియోలకు మంచి స్పందన ఉంది. – గోపాల్, కంటెంట్ రైటర్
చిన్న పిల్లలకు కరోనా గురించి అర్థమయ్యేలా అనేక వీడియోలు యానిమేషన్లో రూపంలో ఉన్నాయి. వాటిని మా పిల్లలకు చూపించి అవగాహన కల్పిస్తున్నాం. వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మాస్క్, భౌతికదూరం, పరిశుభ్రత అవసరాన్ని అందులో వివరించారు. ఇప్పుడు మా పిల్లలు ఆ వీడియోలు చూసి మాకే కరోనా గురించి జాగ్రత్తలు చెబుతున్నారు. – సంగీత, గృహిణి