గురువారం 28 మే 2020
Hyderabad - May 21, 2020 , 00:44:20

ఆదర్శంగా నిలుస్తున్న నెస్ట్‌ అపార్ట్‌మెంట్స్‌

ఆదర్శంగా నిలుస్తున్న నెస్ట్‌ అపార్ట్‌మెంట్స్‌

నానాటికీ అడుగంటుతున్న భూగర్భజలాల సమర్థ వినియోగంపై ప్రజలను చైతన్య పరిచేందుకు జీహెచ్‌ఎంసీ పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు సాధించాలన్నది ప్రభుత్వ తాజా ఆదేశం. అందుకు అనుగుణంగా 100కు పైబడి ఫ్లాట్లు ఉన్న ప్రతి బహుళ అంతస్థుల భవనంలో విధిగా ‘సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు’ (ఎస్‌టీపీ)ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిందేనని మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. వృథానీటిని విధిగా సద్వినియోగం చేసుకునేలా భవన నిర్మాణ దారుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే ఇప్పటికే వందల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్న కొన్ని అపార్టుమెంట్లలో ఈ ప్రక్రియను అత్యంత సమర్థంగా అమలు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. 

  • మురుగు నీరు... మొక్కలకు
  • ఎనిమిదేండ్లుగా ఎస్‌టీపీతో 50 వేల లీటర్ల నీటి శుద్ధి
  • ఆదర్శంగా నిలుస్తున్న నెస్ట్‌ అపార్ట్‌మెంట్స్‌

శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధి శ్రీనివాసనగర్‌ కాలనీలోని ‘ది నెస్ట్‌ అపార్టుమెంట్‌' ఎస్‌టీపీ నిర్వహణను గడిచిన ఎనిమిదేండ్లుగా అత్యంత సమర్థంగా.. విజయవంతంగా కొనసాగిస్తూ పచ్చదనాన్ని కాపాడుకుంటున్నది. ఈ అపార్టుమెంట్‌లో మొత్తం ఆరు బ్లాకులు ఉండగా.. ఒక్కో బ్లాకులో 40 చొప్పున ఆరు బ్లాకులు కలిపి మొత్తం 240ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో సుమారు వెయ్యి మంది వరకు నివాసం ఉంటున్నారు. ఆరు బ్లాకుల నుంచి కలిపి ప్రతిరోజూ సుమారు 50 వేల లీటర్ల వరకూ వ్యర్థ నీరు విడుదలవుతున్నది. ఈ మురుగు నీటిని శుద్ధి చేసేందుకు అపార్టుమెంట్‌లోని సెల్లార్‌లో ప్రత్యేకంగా నీటి శుద్ధి ప్లాంట్‌ను అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకున్నది. 

మురుగునీరు శుద్ధిచేసి.. మొక్కలకు వినియోగం

ప్రతిరోజూ శుద్ధి చేసిన సుమారు 30 నుంచి 40 వేల లీటర్ల నీటిని అపార్టుమెంట్‌కు నాలుగువైపులా ఉన్న సుమారు 10 వేల మొక్కలతో పాటు లోపల ఉన్న పార్కు, ఆరు బ్లాకుల నడుమ ఉన్న నాలుగు గార్డెన్‌లకు వినియోగించుకుంటూ పచ్చదనాన్ని పరిరక్షించుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని తమ చెట్లకు వినియోగించగా మిగిలినవి పక్కనే ఉన్న చెరువులోకి వదులుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ నీటి శుద్ధి ప్రక్రియను చేపట్టి.. శుద్ధిచేసిన నీటిని ఓ పెద్ద ట్యాంకులో నిల్వ చేసుకుంటున్నారు. ఆ నీటినే మొక్కలకు వాడుతూ ఈ అపార్టుమెంట్‌ వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

అపార్టుమెంట్‌ లోపలమొత్తం 7 వరకు మోటార్లుండగా.. వాటి ద్వారా వచ్చే చుక్క నీటినీ ఇప్పటివరకూ వృథా చెయ్యలేదు.. ఫ్లాట్లలో వినియోగించిన అనంతరం వెలువడేమురుగు నీటినే శుద్ధి చేసి.. మొక్కలకువాడుతున్నామని ప్లాంట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్నఅప్పలనాయుడు తెలిపారు.

మురుగునీటిని వృథా కానిచ్చే ప్రసక్తే లేదు..

మా నెస్ట్‌ అపార్టుమెంట్‌ సముదాయానికి ప్రత్యేకంగా ఒక నీటి శుద్ధి ప్రక్రియ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఫ్లాట్ల నుంచి వచ్చే మురుగు నీటిని ఈ యంత్రాల ద్వారా శుద్ధిచేసి అపార్టుమెంటు లోపల ఉన్న వందలాది చెట్ల రక్షణకు వినియోగిస్తున్నాం. తద్వారా బోరు నీటిని వృథా చేయకుండా నిలువరించగలుగుతున్నాం. అపార్టుమెంట్‌లో ఉన్న ప్రజలంతా ఇందుకు సంపూర్ణ తోడ్పాటును అందిస్తుండటం వల్లే ఈ ప్రక్రియను విజయవంతంగా చేపట్టగలుగుతున్నాం. మురుగునీటిని వృథా కానిచ్చే ప్రసక్తే లేదు. - దామోదర్‌రెడ్డి, నెస్ట్‌ అపార్టుమెంటు వాసి.
logo