బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Jul 11, 2020 , 00:32:53

నాకేమైతది..!

నాకేమైతది..!

కొంప ముంచుతున్న నిర్లక్ష్య వైఖరి

కొత్త లక్షణాలు చూపిస్తూ.. దోబూచులాడుతున్న కరోనా

పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

నివారణ చర్యలు పాటించకపోతే  ప్రమాదకరంగా మారే పరిస్థితి

పదిరోజుల్లోనే 12497 మందికి పాజిటివ్‌

కరోనా కేసులు

జీహెచ్‌ఎంసీ 762

రంగారెడ్డి 171

మేడ్చల్‌ 85

నమ్మకం ఉండాలి.. నిర్లక్ష్యం ఉండకూడదు.. ఆత్మవిశ్వాసం ఉండాలి.. అజాగ్రత్త పనికిరాదు... ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందో అర్థమయ్యే ఉంటుంది. నాకేం కాదు.. అనుకునే కొందరి ధోరణి.. కరోనా విజృంభణకు దారితీస్తున్నది.  మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడంలో చూపిస్తున్న అలసత్వం వల్ల మహమ్మారి కొత్త లక్షణాలతో విరుచుకుపడుతున్నది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి దోహదం చేస్తున్నది. అపనమ్మకం ఆవహించిన వాళ్లు ఇప్పటికైనా మేల్కోవాలి. నివారణ చర్యలు పాటించాలి. అనవసరంగా తిరిగే బదులు చక్కగా ఇంటిపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలి. లేకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముంటుంది.

సిటీబ్యూరో-నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ తనదైన శైలిలో విస్తరిస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను వణికిస్తున్నది. పది రోజుల్లోనే 12497 కేసులు నమోదయ్యాయంటే వైరస్‌ తీవ్రత ఏ విధంగా ఉందో తెలుస్తున్నది. కొత్తకొత్త లక్షణాలతో దోబూచులాడుతున్న మహమ్మారి దాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఏ స్థాయివారిని వదలడంలేదు. కొందరి నిర్లక్ష్యానికి పెద్ద సంఖ్యలో అమాయకులు బాధితులుగా మారుతున్నారు. నగరంలో కేసుల సంఖ్య పదులు, వందల నుంచి ఇప్పుడు వేలకు చేరుకున్నది. పరిస్థితులు అద్దంపడుతున్నా.. ఇంకా చాలామంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు విందులు.. వినోదాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ఎవరికీ చెవికెక్కడం లేదు. ఇలానే వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మూడవ దశకు చేరుకునే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడవ దశకు చేరుకుంటే లోకల్‌ ట్రాన్సిమిషన్‌(స్థానికంగా వ్యాప్తిచెందడం)పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలుపుతున్నారు. వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువ శాతం త్వరగా కోలుకుంటున్నారు. కొందరికి సమయం పడుతున్నది. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న ర్యాపిడ్‌ టెస్టులకు ప్రజలు అధికంగా తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.

మొదటి దశలో...

మొదటి దశలో కేవలం కరోనా ప్రభావిత ప్రాంతాలైన విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్‌ సోకింది. ఈ క్రమంలో కేసులు కూడా పదుల సంఖ్యలోనే ఉండటంతో ఎక్కువమంది వైద్యులు రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మరణాల సంఖ్య నామమాత్రంగా నమోదైంది. 

రెండవ దశలో..

రెండవ దశలో పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారికి, కలిసి మెలిగినవారికి మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందింది. వైద్యులు, అధికారులు సైతం వైరస్‌బారిన పడ్డారు. ఈ దశలో మరణాల సంఖ్య కొద్దిమేర పెరిగింది.

మూడవ దశలో...

మూడవ దశలో కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన బాధితులతో సంబంధం లేకుండా స్థానికంగానే ఒకరి నుంచి మరొక్కరికి సోకుతుంది. ఎవరి నుంచి సోకిందో తెలియకుండా వైరస్‌ ప్రబలే ప్రమాదముంటుందని గాంధీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రోగుల సంఖ్య వేలలో నమోదై, అత్యధిక సంఖ్యలో రోగులు, తక్కువ సంఖ్యలో వైద్యులు ఉండి రోగులపై మొదటి, రెండవ దశలో పెట్టినంత దృష్టి మూడవ దశలో పెట్టే అవకాశముండకపోవచ్చంటున్నారు.  

మూడవ దశలో కలిగే అనర్ధాలు

మూడవ దశలో ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వైరస్‌ వ్యాప్తి చెంది రోగుల సంఖ్య భయంకరంగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబాలకు కుటుంబాలే దవాఖానల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్‌ అయినప్పటికీ ప్రస్తుత కేసులను పరిశీలిస్తే ఇది మల్టీ ఆర్గాన్స్‌పై ప్రభావం చూపుతున్నట్లు తేలింది’ అని గాంధీ దవాఖాన జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. కరోనా వల్ల ఊపిరితిత్తులతో పాటు లివర్‌, కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో సదరు ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యి రోగి మరణించే ప్రమాదాలున్నట్లు తేల్చిచెప్పారు. మూడవ దశలో లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు అధికమవడంతో బీపీ, షుగర్‌, ధైరాయిడ్‌, హెచ్‌ఐవీ, ఆల్కహాల్‌ సేవించే వారికి వైరస్‌ సోకితే వారు బతికే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. ఈ క్రమంలో  మరణాల రేటు అధికంగా ఉండే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. 

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో మొట్టమొదటి ‘ప్లాస్మా థెరపి’

అమీర్‌పేట్‌ : సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో మొట్టమొదటి ప్లాస్మా థెరపిని విజయవంతంగా నిర్వహించారు. ఇదే దవాఖానలోని ఆపరేషన్‌ థియేటర్‌లో సీనియర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న  కరోనా బారిన పడి ఇటీవల కోలుకున్నాడు. దీంతో అతడి నుంచి ఈ నెల 6న యాంటీ బాడీలను సేకరించారు. దేశంలోని ఈఎస్‌ఐసీ దవాఖానల్లో మొట్టమొదటి సారిగా యాంటీ బాడీలను సేకరించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.కె.పాల్‌ తెలిపారు. 

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌లో 66 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

గోల్నాక : అంబర్‌పేటలో మరో 48 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో 46 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డీసీ రమేశ్‌ తెలిపారు.

దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 37 మందికి పాజిటివ్‌ వచ్చింది. మొత్తం 520 కేసులు నమోదయ్యాయి.

రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలోని హబ్సిగూడ, రామంతాపూర్‌, ఉప్పల్‌, డివిజన్లలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉప్పల్‌ ఆరోగ్యకేంద్రంలో 45 ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్‌ తేలింది.

అహ్మద్‌నగర్‌ : చింతల్‌బస్తీ యూపీహెచ్‌సీలో 11, అహ్మద్‌నగర్‌ డివిజన్‌లో 5 , శాంతినగర్‌, అఫ్జల్‌సాగర్‌ యూపీహెచ్‌సీలలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.

బడంగ్‌పేట : బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17కేసులు వచ్చాయి.

బాలానగర్‌ : కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 15 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ చందర్‌ తెలిపారు. 

హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో 11కేసులు వచ్చాయి.

బోడుప్పల్‌ : బోడుప్పల్‌ ఎన్‌ఐఎన్‌ కాలనీలో తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

మలక్‌పేట : శాలివాహననగర్‌ పట్టణ ఆరోగ్యకేంద్రంలో 9 కేసులు వచ్చాయి.

బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, బైబిల్‌ హౌస్‌ యూపీహెచ్‌సీల పరిధిలో పది మందికి పాజిటివ్‌ వచ్చింది. 

మెహిదీపట్నం : ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో 8మందికి పాజిటివ్‌ వచ్చింది. 

కందుకూరు : కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో నలుగురు ఉద్యోగులకు, తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

తెలుగుయూనివర్సిటీ : నిలోఫర్‌ దవాఖానలో నలుగురు గర్భిణిలు, ఓ ఉద్యోగికి  పాజిటివ్‌ వచ్చింది.

కాప్రా : కాప్రాసర్కిల్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  

మేడ్చల్‌ : మేడ్చల్‌లో పట్టణంలోని ఉమానగర్‌, చంద్రనగర్‌లో ఇద్దరికి, గుండ్లపోచంపల్లిలో యువకుడికి  పాజిటివ్‌ వచ్చింది.

ప్రముఖ నృత్య గురువు మృతి 

తెలుగుయూనివర్సిటీ : ప్రముఖ నృత్య గురువు మునుకుంట్ల సాంబశివ రావు(60)కరోనాతో శుక్రవారం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భార్య, కుమార్తె కూడా కరోనాతో పోరాడుతున్నారు.

కరోనాను ఇలా జయించారు...

కోలుకొని ప్లాస్మా దానంచేశాను..

వినాయక్‌నగర్‌ : నాకు కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానలో చికిత్స నిమిత్తం చేరాను. ఏమవుతుందోనని ఏడుస్తుండగా వైద్యులు, నర్సులు వచ్చి నాకు మనోధైర్యం కల్పించారు. వారు ఇచ్చిన ధైర్యంతో పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నా. నా వంతుగా గాంధీ దవాఖానలో ప్లాస్మా దానం చేశానని నేరేడ్‌మెంట్‌ న్యూవిద్యానగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. 

వైద్యులు మనోధైర్యం నింపారు..

దోమలగూడ : కార్పొరేట్‌ దవాఖానలకు ధీటుగా గాంధీలో చికిత్స అందించారు. ఉదయం, సాయంత్రం వైద్యులు వచ్చి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడూ నర్సులు వచ్చి మాత్రలు అందించారు. అత్యవసర సమయంలో చీఫ్‌ డాక్టర్లు, సూపరింటెండెంట్‌ వచ్చి పలు సూచనలు ఇస్తూ మనోధైర్యాన్ని నింపారు. 14రోజుల వ్యవధిలో రెండు సార్లు పరీక్షలు చేశారు. నెగెటివ్‌ వచ్చిన తర్వాత డిశ్చార్జి చేయడంతో 14రోజులు ఇంటివద్ద విశ్రాంతి తీసుకున్నాను. పూర్తిగా కోలుకోవడంతో తిరిగి విధుల్లో చేరాను. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానంటే అది గాంధీ వైద్యుల దయవల్లనేనని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ వీరశేఖర్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలుపుతూ కంటతడి పెట్టాడు. ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి వైరస్‌ కట్టడికి సహకరించాలని కోరారు.కుటుంబమంతా కోలుకున్నాం..

బడంగ్‌పేట్‌ : కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓపికతో వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే వైరస్‌నుంచి భయటపడుతాం. గాంధీ దవాఖానలో డాక్టర్లు, నర్సులు ఏమీ కాదని ధైర్యం చెప్పారు. డాక్టర్లు రోజుకు రెండు సార్లు వచ్చి పరీక్షలు జరిపారు. మేము భయపడకుండా వైద్యం చేస్తున్నాం కదా.. మీరు కూడా మాలానే ఉండండి.. అదే నయం అవుతుందని భరోసా కల్పించారు. చెప్పినట్లు పాటిస్తే కరోనానుంచి భయటపడుతారని తెలిపారు. వారు తెలిపినట్లుగా మందులు వేసుకుని కరోనానుంచి మా కుటుంబమంతా (9 నెలల పాపతో సహా ఏడుగురు) క్షేమంగా ఇంటికి చేరామని జీహెచ్‌ఎంసీలో పారిశుధ్యకార్మికురాలిగా పనిచేస్తున్న భారతమ్మ తెలిపారు. 

ఆకలి సమస్య రాలేదు..

పహాడీషరీఫ్‌ : ఉన్నట్టుండి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలుపగానే ఆందోళనకు గురయ్యాను. చికిత్స కోసం గాంధీకి తరలించగా భయం వేసింది. వైద్యులు రోజుకు మూడు సార్లు వచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సమస్య ఉంటే వెంటనే చెప్పాలని.. భయపడకూడదని ధైర్యం చెప్పారు. ప్రతి రోజు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం మూడు రకాల కూరలతో భోజనం, సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ బత్తాయి రసం, రాత్రి భోజనం, గుడ్డు, అరటిపండ్లు ఇచ్చారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఆకలి సమస్య రాలేదు. కాకపోతే 10రోజులు ఇంటికి దూరంగా ఉన్నానని భాద మాత్రం ఉండేది. ప్రస్తుతం కోలుకొని యథాస్థితికి చేరుకున్నానని పహాడీషరీఫ్‌కు చెందిన వీరేందర్‌ తెలిపారు.logo