బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 08:48:55

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

దోమలగూడ : గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ నగర సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 14న రాత్రి 10.30 గంటలకు ట్యాంక్‌ బండ్‌పై  నడుచుకుంటూ వెళ్తున్న చింతల్‌బస్తీకి చెందిన సత్యనారాయణ (70)ను సంకేత్‌ యాదవ్‌ అనే యువకుడు కారుతో ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంకేత్‌.. బాధితుడిని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంపై ఉస్మానియా దవాఖాన నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై లక్ష్మీనారాయణ ఇద్దరు కానిస్టేబుళ్లు చిరంజీవి, దామోదర్‌లను అక్కడికి పంపించాడు. అయితే  పోలీసులు దవాఖానకు వెళ్లి బాధితుడి నుంచి కాకుండా అతడిని ఢీకొట్టిన సంకేత్‌ యాదవ్‌ నుంచి నివేదిక తెచ్చి ఎస్సైకు సమర్పించారు. దీనిపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా సిబ్బంది బండారం బయటపడింది. ఉద్యోగ నిర్లక్ష్యమే కాకుం డా బాధితుడి తరఫున ఉండకుండా, నిందితుల తరఫున ఉన్నందుకు నగర సీపీ ఆ ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు చేశారు.