శనివారం 28 నవంబర్ 2020
Hyderabad - Nov 21, 2020 , 08:36:50

మీది విష ప్రచారం.. మాది అభివృద్ధి మంత్రం

మీది విష ప్రచారం.. మాది అభివృద్ధి మంత్రం

ఖైరతాబాద్‌: ‘మీది అబద్ధాల ఎజెండా అయితే.. మాది అభివృద్ధి ఎజెండా.. తెలంగాణలో మీ ఢిల్లీ రాజకీయాలు చెల్లవు.. మత విద్వేషాలతో ఓట్లు పొందాలని చూస్తున్నారు. తెలంగాణ బిడ్డలు తెలివైన వారు.. విద్వేషాలు సృష్టించే బీజేపీని.. ప్రశాంతత, సురక్షిత పాలనను అందిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తారో మరికొద్ది రోజుల్లో  తేలిపోతుంది’ అని ఎమ్మెల్సీ, ఖైరతాబాద్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పి. విజయారెడ్డి గెలుపు బాధ్యతను తన భుజ స్కందాలపై వేసుకున్న లక్ష్మణ్‌ రావు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ విధానం.. బీజేపీ నేతల కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలను బయటపెడుతూ ప్రజలను జాగృతపరుస్తున్న తీరును శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ముందు.. తర్వాత..

ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం అధోగతి పాలైంది. ఇక్కడి వారి సొమ్మును ఎవరు పడితే వారు దోచుకెళ్లారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, త్యాగాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆరేండ్ల ప్రగతి ప్రతి తెలంగాణ బిడ్డ కండ్ల ఎదుట సజీవ సాక్షాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కరణలు, మంత్రి కేటీఆర్‌ చొరవతో 60 ఏండ్లలో కానిది ఆరేండ్లలో సాధ్యమైంది. హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపాంతరం చెందిందంటే అది సీఎం కేసీఆర్‌ ఘనతే. బల్దియా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ఎజెండా. అమెజాన్‌ మొదలుకొని ఆపిల్‌, గూగుల్‌ లాంటి సంస్థలు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాయి. 

ఆరేండ్లలో ఒక్క మత ఘర్షణ లేదు..

కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కులాలు, మతాల పేరిట చేసిన రాజకీయాల ఫలితం మత ఘర్షణలు చోటు చేసుకునేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరేండ్ల కాలంలో ఒక్క మత ఘర్షణ జరిగిన దాఖలాలు లేవు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అత్యాధునిక పోలీసింగ్‌ వ్యవస్థ, ఆడపిల్లల రక్షణకు షీటీమ్స్‌, నేరాల అదుపునకు లక్షలాది సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నేడు హైదరాబాద్‌ నగరం దేశంలోనే సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌ జోన్‌గా రూపాంతరం చెందింది. ఇది సీఎం కేసీఆర్‌ పారదర్శక పాలనకు నిదర్శనం. బల్దియాలో సమష్టిగా 110 స్థానాలను సాదించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం. 

గోల్కొండపై జాతీయ పతాకమా..  కాషాయ జెండానా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజకీయ, సామాజిక పరికత్వక లేక మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలో ఎర్రకోట, గోల్కొండపై ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఎగురవేసిన దాఖలాలున్నాయి. కానీ ఆ పెద్ద మనిషి కాషాయ జెండా ఎగురవేస్తానంటున్నాడు. చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.. రాజకీయ పరిజ్ఞానం.. రాజ్యాంగం విలువలు తెలియని ఆయన మాటలను ప్రజలు విశ్వసించరు. బల్దియా ఎన్నికల్లో ప్రజలు జాతీయ జెండాకే ప్రాధాన్యతనిచ్చి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారు. బండి సంజయ్‌ ఇకనైనా వాస్తవాలను వివరించాలి.

పది వేలు అడ్డుకొని రూ.25 వేలు ఇస్తారా?

వరదలతో సర్వం కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న సామాన్య ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడేందుకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందిస్తుంటే వారి నోటికాడి బుక్కను అడ్డుకున్న బండి సంజయ్‌.. బల్దియాలో గెలిస్తే రూ.25వేలు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో మాట మార్చి ఫోర్జరీ అంటున్నాడు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ర్టాల్లో పరిహారం ఇచ్చారో ప్రజలకు తెలుపాలి. దేశ చరిత్రలో స్వయంగా బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గ్రహించాలి. అబద్ధాలతో ఓట్లు రాబట్టాలని చూస్తే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారు. 

ఖైరతాబాద్‌లో భారీ విజయం ఖాయం

బీజేపీలా అబద్ధాలతో కాకుండా అభివృద్ధి పనులే ఏజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నాం.  గడప గడపకు వెళ్లి అభివృద్ధికి ఓటు వేయాలని కోరుతున్నాం. సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి హయాంలో డివిజన్‌ ఎంతో అభివృద్ధి చెందింది. అదే స్ఫూర్తిని రెండో దఫా కొనసాగిస్తారు. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాం.