బుధవారం 23 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 07, 2020 , 00:52:40

నలు దిశలా ఐటీ నగ...

నలు దిశలా ఐటీ నగ...

గ్రిడ్‌తో మారనున్న భాగ్యనగర రూపురేఖలు..

ఔటర్‌ చుట్టూ పరిశ్రమల విస్తరణ,  సమతుల్య అభివృద్ధి.. మేడ్చల్‌ జిల్లా పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు కేటాయింపు

వరంగల్‌ హైవే, రాజీవ్‌ రహదారి వెంట ఏర్పాటు చేసే అవకాశం.. అనువైన స్థలాలుగా పోచారం, కొంపల్లి ప్రాంతాలు 

ఇప్పటికే పూర్తయిన స్థల పరిశీలన.. రంగారెడ్డి జిల్లా పరిధిలో శంషాబాద్‌, ఉస్మాన్‌ సాగర్‌ ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషణ 

భాగ్యనగరాన్ని సమతుల్య పద్ధతిలో సిరిసంపదలతో తులతూగే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నలువైపులా ఐటీ పరిశ్రమలను విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగర ప్రమాణాలు కలిగిన ‘బెస్ట్‌ లివబుల్‌ సిటీ’ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే హైదరాబాద్‌ గ్రిడ్‌ గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్షన్‌ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాబోయే ఐదేండ్లలో సరికొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. 

-సిటీబ్యూరో/మేడ్చల్‌,  నమస్తే  తెలంగాణ/ హైదర్‌నగర్‌/ఉప్పల్‌/శంషాబాద్‌

నలుదిక్కులా అభివృద్ధి వ్యూహం 

ఇప్పటివరకు కేవలం గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఐటీ పరిశ్రమ ఇక ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట విస్తరణ జరగనుంది. తూర్పున ఉప్పల్‌, పోచారం వద్ద, ఉత్తరాన కొంపల్లి, దక్షిణాన శంషాబాద్‌- ఆదిబట్ల,  వాయవ్యంలో కొల్లూరు- ఉస్మాన్‌ సాగర్‌ ప్రాంతాల్లో కొత్త ఐటీ పరిశ్రమల స్థాపనకు నాంది పలకనుంది. మేడ్చల్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులు, ఐటీ సెజ్‌లకు తోడుగా కొంపల్లి, మాదారం ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఐటీ గ్రిడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే భూ పరిశీలన కూడా పూర్తయింది. ఇప్పటికే భూ పరిశీలన కూడా పూర్తయింది.

‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’తో మొదలై ..

పశ్చిమ మండలంలో ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఉండడంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి తగ్గించేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఇప్పటికే లుక్‌ ఈస్ట్‌ పాలసీ వ్యూహం అమలవుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్‌, సంస్కృతి టౌన్‌షిప్‌ పక్కనే రహేజా ఐటీ పార్కు, ఉప్పల్‌-రామంతాపూర్‌లో ఐటీ సెజ్‌, హబ్సిగూడలో జెన్‌ప్యాక్ట్‌ వంటి పరిశ్రమలలో షిఫ్టుల వారిగా వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా కొంపల్లి (450-500 ఎకరాల్లో) మాదారం (450-500) ప్రాంతాల్లో ఐటీగ్రిడ్‌ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే సుమారు 900-1000 ఎకరాల విస్తీర్ణంలో వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. డీఎస్‌ఎల్‌ లాంటి ఐటీ కంపెనీ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక ప్రాంతాలకు పెట్టింది పేరుగా ఉన్న ఉప్పల్‌ ప్రాంతంలో 35 ఐటీ పార్కులు రాబోతున్నాయి. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా మార్చే ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా 5 ఐటీ కంపెనీల కోసం 25 లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేయనున్నారు. పారిశ్రామిక స్థలాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కన్వర్షన్‌ పత్రాలను కూడా అందజేశారు.

శివారు పట్టణాలకు మహర్దశ 

కొత్త ఐటీ గ్రిడ్‌ పాలసీతో నగర శివారు పట్టణాలు వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి. పోచారంలో నెలకొల్పబోయే ఐటీ పరిశ్రమల ద్వారా హైదరాబాద్‌ తూర్పు ప్రాంతాల్లో ఉండేవారితో పాటు భువనగిరి, ఘట్‌కేసర్‌, ఆలేరు వాసులకు కూడా సౌలభ్యంగా ఉండనుంది. వీటిని అనుబంధ పరిశ్రమలు, వ్యాపారాలు వర్ధిల్లే అవకాశం ఉంది. అలాగే శంషాబాద్‌- ఆదిబట్ల పరిశ్రమ ద్వారా షాద్‌నగర్‌, పరిగి ప్రాంతాల వరకు పట్టణీకరణ వ్యాపించేందుకు అనుకూలంగా ఉంటుంది.

సేవల విస్తరణతో ఐటీ ఎగుమతుల వృద్ధి

ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ఐటీ సేవలకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో ఆ మేరకు ఎగుమతుల విలువలో, కొత్తగా వస్తున్న ఉద్యోగాల సంఖ్యలో మంచి పురోగతి కనబడుతున్నది. జాతీయ ఐటీ రంగం గణాంకాల ప్రకారం దేశ వ్యాప్త ఐటీ అభివృద్ధి 8.09 శాతం కాగా, తెలంగాణలో 19.93 శాతంగా నమోదైంది. ఇందుకు కారణమైన సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉండడం గమనార్హం.

అత్యాధునిక వసతులతో.. కొత్త గ్రిడ్‌ 

గతంలో ఏర్పాటు చేసిన ఐటీ కారిడార్‌లకు భిన్నంగా ప్రభుత్వం కొత్త ఐటీ గ్రిడ్‌లను ఏర్పాటు చేయనుంది. ఐటీ పార్కులలో హెలిప్యాడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్‌ హాల్‌, సోలార్‌ లైటింగ్‌ సిస్టం, సోలార్‌ పవర్‌ వెహికిల్స్‌, వాటర్‌ బాడీస్‌, అందమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, వాటర్‌ హార్వెస్టింగ్‌ మెకానిజం, హెల్త్‌సిటీ, స్పోర్ట్స్‌క్లబ్‌, గ్యాస్‌-ఫైర్‌ స్టేషన్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌, స్కిల్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌, ఐటీ నాలెడ్జ్‌ పార్కులు, ఇంక్యుబేటర్స్‌, హోటల్స్‌, బ్యాంకులు, రెస్టారెంట్స్‌, సూపర్‌మార్కెట్స్‌, ఫుడ్‌కోర్టులు, డిజిటల్‌ లైబ్రరీలు.. అలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులను కల్పిస్తూ ఐటీ పార్కులను ఏర్పాటు చేయనుంది.

వేగం పుంజుకున్న ఆదిబట్ల

ఆదిబట్ల: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌- ఆదిబట్ల ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం ఐటీ విస్తరణకు ఎంచుకున్నది. దీనికి కన్నా ముందే కొంతమేరకు పారిశ్రామిక విస్తరణ జరిగి గ్లోబల్‌ కంపెనీలు కొన్ని ఇక్కడ తమ సేవలు ప్రారంభించడంతో ఆదిబట్ల పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఆదిబట్లలో వైమానిక దిగ్గజాలు బోయింగ్‌, టాటా అడ్వాన్సడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(టీఏఎస్‌ఎల్‌)ల సంయుక్త భాగస్వామ్య సంస్థ టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ రూ. 400 కోట్లతో చేపట్టిన పనులకు 2016 జూన్‌లో అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌తో, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌  శాఖ మంత్రి కేటీఆర్‌లు శంకుస్థాపన చేశారు. బోయింగ్‌ అపాచీ 13ఎకరాల్లో, 14వేల చదరపు వి విస్తీర్ణంలో టాటా బోయింగ్‌ విడిభాగాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు 2018 మార్చిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, టాటా సంస్థల చైర్మెన్‌ రతన్‌టాటా, అమెరికా రాయబారి కెన్త్‌జుస్టర్‌తో కలసి అపాచీ ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. అమెరికాతో పాటు ఇతర దేశాల రక్షణ దళాలు ఉపయోగిస్తున్న అత్యాధునిక అపాచి ఏహెచ్‌-64హెలికాప్టర్‌ కేబిన్‌తో పాటు విడిభాగాలను ఆదిబట్ల టాటా ఏరోస్పేస్‌లో  తయారు చేస్తున్నారు.  ఇవే కాకుండా స్థానిక సమూహ ఏరోస్పేస్‌లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి.  వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన ఏరోస్పేస్‌ పార్కులో సుమారు 35 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆసంస్థ ప్రతినిధులు ఇదివరకే ప్రకటించారు.

ఇవీ ప్రోత్సాహకాలు..!

ఇండస్ట్రియల్‌ నుంచి ఐటీ పార్కు మార్పిడిని డెవలపర్లు ఎంచుకోవచ్చు. డెవలపర్‌లకు 50-50 మార్పిడి అందిస్తారు. ఇందులో మొత్తం అంతర్నిర్మిత స్థలంలో(బిల్డప్‌ స్థలం) గరిష్టంగా 50 శాతం వరకు ఐటీయేతర(నివాస లేదా వాణిజ్య ఉపయోగం)వైపు వారు ఉపయోగించవచ్చు. డెవలపర్‌ తనకు కావాలనుకుంటే ఐటీ వాడకంలో అంతర్నిర్మితంలో 50 శాతం మించి పోవచ్చు. ఇండస్ట్రియల్‌ నుంచి ఐటీ పార్కుగా మార్చడానికి ఛార్జీలు మొత్తం భూమిపై ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ విలువలో 30 శాతం చెల్లించాలి.

ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలకు యూనిట్‌ విద్యుత్‌కు రూ.2 సబ్సిడీ, గరిష్టంగా సంవత్సరానికి 5 లక్షలు దాటకుండా ఇస్తారు 

ఐటీ/ఐటీఇఎస్‌ సంస్థలకు లీజు అద్దె మీద 30 శాతం సబ్సిడీ, గరిష్టంగా సంవత్సరానికి 10 లక్షలు దాటకుండా ఇస్తారు. 

500 కంటే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే ఆ సంస్థలులేదా యూనిట్ల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ప్యాకేజీ అందిస్తారు 

రంగారెడ్డి జిల్లాలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ:  నగర ఐటీ ఉద్యోగులకు బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్దనగరాలకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే ఇబ్బందులు తప్పుతున్నాయి. గత ఐదేండ్ల కాలంలో విస్తృతమవుతున్న ఉపాధి అవకాశాలతో వారికి ఇక్కడే ఉద్యోగం చేసే వీలు దక్కుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని దక్షిణంలో ఉన్న విమానాశ్రయం, శంషాబాద్‌, ఆదిబట్ల, వాయవ్యంలో (జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొల్లూరు ప్రాంతంలో,ఉస్మాన్‌ సాగర్‌లో)సహా పశ్చిమానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహించడానికి గ్రిడ్‌ విధానం ఉపకరించనుంది. జిల్లాలో ఇప్పటికే గచ్చిబౌలి, నానక్‌ రాం గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, మహేశ్వరం, ఆదిబట్ల తదితర ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే 30 చోట్ల ఐటీ కమర్షియల్‌ స్పేస్‌ కేటాయించారు. రూ.5,422 కోట్లతో ఏర్పాటైన ఈ కంపెనీలలో 1,79,622 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే మరో 66 చోట్ల పరిశీలన దశలో ఉన్నాయి. అవి ఆమోదం పొందితే రూ.22,760.51కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. వీటిలో దాదాపుగా 5,39,693 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

కొర్రెముల టు పోచారం ఇన్ఫోసిస్‌

100 అడుగుల రోడ్డు.. నిర్మాణ పనులపై సమన్వయ సమావేశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు గురువారం రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నేరేడ్‌మెట్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోని ఐటీ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్రెముల నుంచి పోచారం ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ దక్షిణం వైపు ప్రాంతాన్ని కలుపుతూ 100 అడుగుల రోడ్డు పనుల నిర్మాణానికి సంబంధించి చర్చించారు. ఈ రోడ్డు నిర్మాణంతో నారపల్లి, కొర్రెముల, పోచారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా సాగే అవకాశముంది. వంద అడుగుల రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీకి  మరింత ప్రోత్సాహం లభిస్తుందని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టాల్సిన భూ సేకరణ, ఇతర అంశాలపై పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు, ఐటీ ఈ అండ్‌ సీ సీఆర్‌ఓ అమర్‌నాథ్‌రెడ్డి,టీఎస్‌ఎస్‌ఐసీ జోనల్‌ కమిషనర్‌ మాధవి, దాస్‌ గుణలాన్‌ ఇన్ఫోసిస్‌ ప్రతినిధి, తహసీల్దార్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరింత అభివృద్ధి

ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఆహ్వానించదగినదే. ఎక్కడికక్కడ పరిశ్రమలు రావడం ద్వారా పరసర ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుంది. అటు కంపెనీలకు ఇటు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. 

-పి. శ్రీకాంత్‌ రావు,

టెక్నిక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ 

సంవత్సరం ఎగుమతుల ఉద్యోగాలు 

విలువ

రూ. కోట్లలో

2019-20 1,28,807 5,82,126

2018-19 1,09,219 5,43,033

2017-18 93,442 4,75,308

2016-17 85,470 4,31,891

2015-16 75,070 4,07,385

2014- 15 66,276 3,71,774

2013-14 57,258 3,23,396


logo