గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 23, 2020 , 07:35:44

నిను మరువం నర్సన్నా..

నిను మరువం నర్సన్నా..

పేదల పెద్దన్న, కార్మికుల నాయకుడు, పోరాటాల యోధుడు.. అందరూ నోరారా పిలుచుకునే నర్సన్న మరణం సిటీని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ  ఆయన మిత్రు లు, అభిమానులు, పార్టీలు, సంఘాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఉద్వేగానికి లోనయ్యారు. కడసారి చూపు కోసం పెద్దసంఖ్యలో వెళ్లి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నాయినికి స్థానిక కూడళ్లు, చౌరస్తాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేసి పూల మాలలు వేశారు.

కార్మిక నేత నుంచి హోంమంత్రి దాకా..

  • కార్మిక నేతగా గుర్తింపు పొందిన నాయిని.. ఎన్నో కంపెనీలకు కార్మిక నాయకుడిగా పని చేసి కార్మికుల గుండెల్లో నిలిచిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేస్తూ.. ప్రజలకు సుపరిపాలన అందించారు.
  • 1978లో తొలి సారి శాసన సభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ముషీరాబాద్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి శాసన సభలో అడుగుపెట్టారు. 
  • 1978, 1985 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
  • 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సమయంలోనే కేసీఆర్‌ వెంట నడిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రారంభించిన కొన్ని నెలలకే వచ్చిన హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 
  • 2004 శాసన సభ ఎన్నికల్లో ముషీరాబాద్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 
  • 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా మూడేండ్లపాటు పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికిగాను కేసీఆర్‌ పిలుపు మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న నాయిని కేసీఆర్‌ పిలుపు మేరకు అక్కడి నుంచి ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా లేఖ పంపి తెలంగాణ ఉద్యమంలో చురకుగా పాల్గొన్నారు. 
  •  2008 శాసన సభ ఉప ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 
  •  2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన నాయిని కేసీఆర్‌ మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన 2018 శాసన సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు హోంమంత్రిగా పని చేశారు.
   • ముషీరాబాద్‌,: కార్మిక నాయకుడు, తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణంతో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాయిని ఇక లేరన్న వార్త వినగానే ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. నియోజకవర్గంలో నాయిని గుర్తులను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం రాత్రి నాయిని నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారనే వార్త తెలియగానే వందలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు కడసారి చూపు కోసం అపోలో దవాఖానకు తరలివెళ్లారు. గురువారం ఉదయం ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు మంత్రుల నివాస సముదాయంలోని నాయిని నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మరోవైపు ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు కూడళ్లు, చౌరస్తాల్లో నాయిని చిత్రపటాలు ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అడిక్‌మెట్‌ డివిజన్‌ రాంనగర్‌ గుండు చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్‌ బి.హేమలతారెడ్డి నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు శ్యామ్‌సుందర్‌, సుధాకర్‌గుప్తా, రూపేందర్‌, మల్లిఖార్జున్‌రెడ్డి, మహ్మద్‌ జాహంగీర్‌, నేత శ్రీనివాస్‌, సయ్యద్‌ అస్లాం, బి.శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్‌ ఖదీర్‌, రవియాదవ్‌, ఎ.శ్రీనివాస్‌, ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అదేవిధంగా రాంనగర్‌ చౌరస్తాలోని అమర వీరుల స్తూపం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌గుప్తా, ఎండబ్ల్యూజే ప్రతినిధులు పాలమాలకుల కరుణాకర్‌, కొండేటి శ్రీనివాస్‌, కాసంశెట్టి శివప్రసాద్‌, శేఖర్‌ తదితరులు నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు. 

   ముషీరాబాద్‌కు పెద్దదిక్కు

   ముషీరాబాద్‌ నియోజకవర్గం ప్రజలకు ఐదు దశాబ్దాలుగా చిరపరిచితుడైన నాయిని నియోజకవర్గానికి పెద్దదిక్కుగా నిలిచారు. కార్మిక నాయకుడిగా, శాసన సభ్యుడు, మంత్రిగా ఏ హోదాలో ఉన్నా ముషీరాబాద్‌ ప్రజానీకానికి అందుబాటు లో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధిలో చెరగని ముద్రవేసుకున్నారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు నిత్యం శ్రమించేవారు. ఎవరు ఏ సమస్య ఉందని తనను కలిసినా నేనున్నానంటూ బరోసా ఇచ్చేవారు.  
   • ముషీరాబాద్‌ అభివృద్ధిలో చెరగని ముద్ర
    ముషీరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి లో నాయిని నర్సింహారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. కార్మికులకు చేదోడువాదోడుగా నిలుస్తూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపేవారు. పలు కంపెనీల గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక నాయకుడిగా ఎన్నికై ఆయా కంపెనీల కార్మికులకు అండగా నిలిచారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పలు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించిన ఘనత నాయినిది. ఉమ్మడి ఏపీలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
    • అడిక్‌మెట్‌లోని నల్లకుంట హైస్కూల్‌
    • గంగపుత్ర కాలనీ ప్రాథమిక పాఠశాలలకు కొత్త భవనాలు
    • గురుకుల బీసీ, ఎస్సీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు
    • వీఎస్‌టీ కూడలి విస్తరణ
    • రాంనగర్‌-వీఎస్‌టీ, నల్లకుంట-ట్యాంక్‌బండ్‌ రోడ్ల నిర్మాణం
    • స్టీలు వంతెన ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయించడానికి ప్రత్యేక చొరవ
    • చేపల మార్కెట్‌ రోడ్డులో వరద నీరు, డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
    • సాయిచరణ్‌ కాలనీ, లంబాడితాండలలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
    • రూ.కోటి వ్యయంతో ముషీరాబాద్‌ క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణం
    • ఈస్ట్‌ ఎంసీహెచ్‌ కాలనీలో రూ.3 కోట్ల వ్యయంతో మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం
    • కవాడిగూడ గంటసాల మైదానంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం
    • అడిక్‌మెట్‌ కోపుగుంత మైదానం అభివృద్ధి
    • నాగమయ్యకుంట ప్రధాన నాలాకు రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణం
    • బీమా మైదానం, దామోదరం సంజీవయ్యనగర్‌, అడిక్‌మెట్‌, బాపూజీనగర్‌లలో కమ్యూనిటీహాళ్ల నిర్మాణం 
    • ముషీరాబాద్‌ డిపోలో సీసీ ఫ్లోరింగ్‌, వైఎస్‌ఆర్‌ పార్కు, సుందరయ్య, ముషీరాబాద్‌, చిక్కడపల్లి పార్కుల అభివృద్ధి,
    • చిక్కడపల్లిలో మోడల్‌ మార్కెట్‌, సిటీ సెంట్రల్‌ లైబ్రరీ ఆధునీకరణ పనులకు నిధుల మంజూరు
    • ముషీరాబాద్‌, చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌ల ఆధునీకరణ వంటి పనులు నాయిని పర్యవేక్షణలో జరిగాయి.