ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 24, 2020 , 09:11:01

ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తున్నాం..

ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తున్నాం..

మారేడ్‌పల్లి, అక్టోబర్‌ 23 : రైల్వే ప్రయాణికులకు భద్రత విషయంతో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బెన్నయ్య తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘మై సహేలి’ కార్యక్రమంపై ప్రయాణికులకు రైల్వే పోలీసు సిబ్బంది అవగాహన కల్పించింది. ప్రయాణికురాలి పేరు, ఊరు, ఎక్కడ వరకు ప్రయాణం, ఎంత మంది వెళ్తున్నారు తదిత ర వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ బెన్నయ్య మాట్లాడుతూ దక్షిణమద్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మై సహేలి’ కార్యక్రమాన్ని ఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డీజీ అరుణ్‌కుమార్‌ ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది రైళ్లలో వెళ్లే ప్రయాణికుల వద్దకు వెళ్లి ‘మై సహేలి’ కార్యక్రమంపై అవగాహన కల్పించారని చెప్పారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అత్యవసర సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 182కు డయల్‌ చేయాలని సూచించారు. అలాగే తోటి ప్రయాణికులు ఏవరైనా కూల్‌డ్రింక్స్‌, ఇతరాత్రా తినుబండారాలను ఇస్తే వాటిని తీసుకొవద్దని తెలిపారు. రైళ్లలో ప్రయాణీస్తున్నప్పుడు ఆకలి, దాహం వేసినా ఐఆర్‌సీటీసీ సిబ్బంది విక్రయించే వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రయాణాలకు సంబంధించి వివరాలు ఎవరికి చెప్పొద్దని, అలాగే తమతో తీసుకెళ్తున్న వస్తు సామగ్రిపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మై సహేలి కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రయాణీకులు తమ అభిప్రాయాలను నేరుగా ఆపరేషన్‌ మైసహేలితో పంచుకోవచ్చునని తెలిపారు. రైళ్లతో పాటు స్టేషన్లలో ఉన్న పోలీసు సిబ్బంది ద్వారా తగిన సహాయాన్ని పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్‌ ఎస్సై శ్రీనివాస్‌తో పాటు ఆర్పీఎఫ్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.