సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:27:30

ఆభరణాల కోసమే హత్య..

ఆభరణాల కోసమే హత్య..

  • కూలీ అడ్డానుంచి తీసుకెళ్లి.. మద్యం తాగించి లైంగికదాడి
  • ఆభరణాలు తీసుకొని.. ఆపై చంపేశాడు
  • మేడ్చల్‌లో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు  
  • నిందితుడు అరెస్ట్‌.. ఆభరణాలు స్వాధీనం

జీడిమెట్ల: బంగారు ఆభరణాల కోసమే.. కూలీపని ఉందని తీసుకెళ్లి.. లైంగికదాడికి పాల్పడి ఆపై హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 17న మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.  బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు.  మెదక్‌ జిల్లా, వెల్దుర్తి మండలం, రామంతాపూర్‌ తండాకు చెందిన విజయ (22)  సోదరి లక్ష్మీతో కలిసి ప్రతి రోజూ రైలులో వచ్చి మేడ్చల్‌ పట్టణంలో అడ్డా కూలీగా పనిచేస్తుంది.  

ఇదిలా ఉండగా.. కర్నాటక రాష్ట్రం, గుల్బర్గ జిల్లా, పాల్కంపల్లి గ్రామానికి చెందిన కొడుదుల ఎల్లప్ప అలియాస్‌ రవికుమార్‌ (48) 10 ఏండ్ల క్రితం నగరానికి వచ్చాడు.. రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అలాగే ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకొని.. ఆభరణాలను దోచుకుంటున్నాడు.. కొన్ని సందర్భాల్లో లైంగికదాడికి పాల్పడి.. ఆపై హత్యకు పాల్పడుతున్నాడు.

   విజయ, సోదరితోకలిసి కూలీ అడ్డా వద్ద ఉండగా ఎల్లప్ప గమనించాడు. ఈ నెల 15న ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను గమనించి... వాటిని ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. తన పథకంలో భాగంగా ఈ నెల 17వ తేదీన అడ్డా వద్దకు వెళ్లి.. తన ఇంట్లో పని ఉంది.. ఒక్కరే కావాలని లక్ష్మీని అక్కడే ఉంచి, విజయను బైక్‌పై తీసుకెళ్లాడు. అద్దెకు ఉన్న గదిలోకి తీసుకెళ్లి.. మద్యం తాగించి బిర్యానీ తినిపించాడు.. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి బంగారు ఆభరణాలను లాక్కొన్నాడు. అనంతరం గొంతుపట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అదే రోజు రాత్రి రాత్రి 11 గంటల సమయంలో మృత దేహాన్ని తన నివాసానికి కొద్ది దూరంలో పడేసి..  వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా .. మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తి  భుజంపై వేసుకుని తీసుకెళ్లాడని స్థానికుడు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులతో పాటు బాలానగర్‌ ఎస్‌ఓటీ, క్రైం బ్రాంచ్‌ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి.. నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న ఎల్లప్పను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అలాగే పలు పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో దొంగతనాలతో పాటు ముగ్గురు మహిళలను బెదిరించి లైంగికదాడికి పాల్పడి, వారి వద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.