e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home క్రైమ్‌ కూలీ పని కోసం తీసుకువెళ్లి..

కూలీ పని కోసం తీసుకువెళ్లి..

  • మహిళపై లైంగిక దాడి, హత్య
  • ఘాతుకానికి పాల్పడిన దంపతులు
  • విచారణలో వెలుగుచూసిన మరో మూడు దోపిడీలు
  • వివరాలు వెల్లడించిన బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజ

దుండిగల్‌/జీడిమెట్ల, జూలై 29: భర్త లైంగిక సంతోషం కోసం ఓ మహిళ క్రూరమైన విలన్‌గా మారింది. తోటి ఆడదనే కనికరం లేకుండా ఆమె పై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. భర్తకు లైంగికంగా సంతృప్తిని ఇవ్వలేదనే కోపంతో బాధితురాలిని హతమార్చేందుకు సహకరించింది. దారి మళ్లిన ఓ మహిళ భర్తతో కలిసి నేరాల్లో భాగస్వామురాలైంది. దుండిగల్‌ పోలీసులు ఓ మహిళ మిస్సింగ్‌ కేసును దర్యాప్తు చేపట్టిగా ఈ దంపతుల నేరాలు బయటపడ్డాయి.

నేరాల బాటపట్టిన భార్యా భర్తలు స్వామి, నర్సమ్మను గురువారం దుండిగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పీవీ. పద్మజ, పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రామలింగరాజు, దుండిగల్‌ సీఐ రమణారెడ్డి వివరాలు వెల్లడించారు.

- Advertisement -

వికారాబాద్‌ జిల్లా జనగాం గ్రామానికి చెందిన కూర్వ స్వామి అలియాస్‌ రవి (30) కూలీ. అదే జిల్లా ఓగులాపురం గ్రామానికి చెందిన ఎం.నర్సమ్మ అలియాస్‌ కూర్వ నర్సమ్మ (30) కూలీ. గత తొమ్మిదేండ్లుగా స్వామి, నర్సమ్మ సహజీవనం చేస్తున్నారు. జల్సాలకు బానిసలైన వీరిద్దరూ అవసరాలు తీర్చుకునే క్రమంలో డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకు లేబర్‌ అడ్డాల వద్ద ఉన్న మహిళా కూలీలను టార్గెట్‌ చేసుకున్నారు.

అందులోనూ మద్యం తాగే వారిని, ఒంటిపై ఆభరణాలు ఉన్నవారిని ఎంచుకున్నారు. పథకం ప్రకారం బాధిత మహిళా కూలీలకు పని కల్పిస్తామని నమ్మించి, తమ ముగ్గులోకి లాగుతారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడటంతో పాటు వారి ఒంటిపై నగలు దోచుకుంటారు. పోలీసులకు చిక్కకుండా తరచూ మకాం మార్చుతారు. నిందితులు స్వామి, నర్సమ్మను విచారించగా జిన్నారం, అమీన్‌పూర్‌, శంకర్‌పల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు.

పని పేరుతో పిలిచి..

నాగర్‌కర్నూల్‌ జిల్లా చంద్రబండ తండాకు చెందిన ఖేతావత్‌ భామినీ బాయి(35), తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉపాధి కోసం నగరానికి వచ్చింది. దుండిగల్‌లోని మల్లంపేటలో నివాసముంటూ రోజూవారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈనెల 25న మల్లంపేట లేబర్‌ అడ్డా వద్దకు వెళ్లి కూలీ పని కోసం భామినీ బాయి, ఆమె భర్త ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల సమయంలో స్వామి, నర్సమ్మ తమ బైక్‌పై పథకం ప్రకారం మల్లంపేట లేబర్‌ అడ్డాకు వచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో భామినీ బాయి భర్త తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె ఒక్కతే అడ్డాపై పని కోసం వేచి చూస్తున్నది. పైగా ఆమె ఒంటిపై ఆభరణాలు కూడా ఉన్నాయి.

కాగా, భామినీబాయిపై నేరగాళ్ల కళ్లు పడ్డాయి. వెంటనే ఆమె వద్దకు వెళ్లి గుట్టలో ఉన్న గుడికి పెయింటింగ్‌ వేయాలని తీసుకెళ్లారు. ఇందుకు రూ. 700 కూలీ ఇస్తామని నమ్మబలికారు. భామినీ బాయిని జిన్నారం మండలం మంత్రికుంట గ్రామపరిధిలోని అంకిరాల గుట్టల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత పనేమీలేదని చెప్పిన నర్సమ్మ.. తన భర్తకు లైంగికంగా సహకరించాలని కోరింది. భామినీబాయి ఒప్పుకోకపోవడంతో పాటు ఎదురుతిరిగింది. భార్య నర్సమ్మ సహకారంతో స్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సహకరించలేదన్న కోపంతో నేరగాళ్లు బాధితురాలిని చిత్రహింసలు పెట్టి కిరాతకంగా హత్యచేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలు, మొబైల్‌ ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు.

వెలుగులోకి మరికొన్ని నేరాలు

శంకర్‌పల్లి, జిన్నారం, అమీన్‌పూర్‌, ప్రాంతాల్లో మరో ముగ్గురు మహిళల నుంచి బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నట్లు నేరగాళ్లు అంగీకరించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

పట్టించిన సీసీ కెమెరాలు..

కూలీపనికి వెళ్లిన భామినీబాయి రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఈనెల 26న దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు భామినీబాయిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా నిందితులు గాగిల్లాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana