సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 06:06:57

రూ.15 వేల కోసం ప్రాణం తీశారు

రూ.15 వేల కోసం ప్రాణం తీశారు

మూడుముక్కలాట.. నాలుగురు స్నేహితుల మధ్య చిచ్చురేపింది.  క్షణికావేశంలో ముగ్గురు కలిసి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకున్నారు.  ఈ ఆట తీవ్రత.. పతనమవుతున్న బతుకులపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడుముక్కలాటపై నిషేధం విధించింది. అయినా.. ఆట మాత్రం ఆగలేదు. ఇంకా బతుకులు ఆరిపోతూనే ఉన్నాయి.. కొంతమంది తనువు చాలిస్తే.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పేకాట వివాదంలో ఈనెల 24న బౌరంపేటలో ఓ వాచ్‌మన్‌ స్నేహితుల చేతిలో హత్యకు గురయ్యాడు.  ఈ హత్యకు కారకులైన ముగ్గుర్ని దుండిగల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

దుండిగల్‌, జనవరి 27 : దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ వీవీఎస్‌ రామలింగరాజు, దుండిగల్‌ సీఐ వెంకటేశం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్‌సింగ్‌ రాజ్‌పుత్‌(32), బంటి(27) రెండేండ్ల కిందట నగరానికి వలసవచ్చి దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మలోని ప్రగతి స్కూల్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని టైల్స్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి దగ్గరలోనే నివాసముంటున్న నల్గొండ జిల్లా, సంస్థాన్‌ నారాయణపురం మండలం, వావిళ్లపల్లి గ్రామానికి చెందిన బానోత్‌ దేవేందర్‌(29) ఈ నెల 23న రాత్రి 8 గంటలకు గండిమైసమ్మ చౌరస్తాలోని వుడ్‌ల్యాండ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం సేవించారు. రాత్రి 10 గంటలకు దేవేందర్‌ నివాసముంటున్న గది సమీపంలోనే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా గొరగణమూడి పాలెం గ్రామంలోని రామాలయం వీధికి చెందిన శివగౌడ్‌ అలియాస్‌ సూరిబాబు(49) రూంకు వెళ్లాడు. అక్కడ నలుగురు కలిసి 24వ తేదీన తెల్లవారు జామున 4గంటల వరకు మూడుముక్కలాట (పేకాట) ఆడారు. వీరిలో దిలీప్‌ రూ.13వేలు, దేవేందర్‌ రూ.1500, బంటికి సంబంధించిన వెయ్యి రూపాయలను సూరిబాబు గెలుచుకున్నాడు. 

హత్యచేసి.. డబ్బులు పంచుకున్నారు..

ఆట మధ్యలో దేవేందర్‌ తన డబ్బులు పోయాయని ఆవేశంతో ఒకటి రెండు సార్లు డబ్బులు (రూ.100 నోట్లు)తీసుకొని చించివేశాడు. దిలీప్‌సింగ్‌ రాజ్‌పుత్‌, బంటి, దేవేందర్‌లు ఆవేశంగా బయటకు వెళ్లారు. దీంతో సూరిబాబు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఇది గమనించిన ముగ్గురు నిందితులు తిరిగి ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం సూరిబాబు తలపై గ్రానైట్‌ రాయితో బాదారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మినీగ్యాస్‌ సిలండర్‌తో తలపై బలంగా కొట్టారు. దీంతో సూరిబాబు తలకు బలమైన గాయం కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితులు ముగ్గురు సూరిబాబు జేబు లో ఉన్న డబ్బులు తీసుకొని ఎవరికి వారు పంచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ముగ్గురు దిలీప్‌రాజ్‌పుత్‌ ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో నేరాన్ని తామే చేసినట్లు అంగీకరించడంతో వారి నుంచి రూ.13,800, హోండా యాక్టీవాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో తీవ్రంగా శ్రమించిన దుండిగల్‌ పోలీసులను ఏసీపీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.


VIDEOS

logo