శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 07:44:02

రూ.3.37కోట్లతో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

రూ.3.37కోట్లతో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

  • త్వరలో పనులు ప్రారంభం
  • బల్కంపేట గుడి దగ్గర తీరునున్న ఇబ్బందులు
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

అమీర్‌పేట్‌ : బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నగర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత రద్దీ ఉంటుంది. ఎక్కువమంది సొంత వాహనాల్లో వచ్చే వారే అవడంతో ఇక్కడి వాహనాల పార్కింగ్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుడి పరిసరాల్లో పార్కింగ్‌ చేస్తే ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తుతున్నాయి. ఇక ఆ ఇబ్బందులు తప్పుతాయని, మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. ఆలయం సమీపంలో హౌసింగ్‌ బోర్డుకు చెందిన 527 గజాల స్థలం పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్న పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి తలసాని ఆ ప్లేస్‌ను రెవెన్యూ శాఖకు బదలాయించేందుకు కృషి చేశారు. జి ప్లస్‌ 2 పద్ధతిన పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు జరిపేలా మెట్రోరైల్‌ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పనులు ప్రారంభమైన కొద్ది నెలలకే మెట్రో సంస్థ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దేవాదాయ శాఖే స్వయంగా పనులు చేపట్టేలా మంత్రి చొరవ తీసుకున్నారు. సోమవారం తన ఛాంబర్‌లో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, మెట్రోరైల్‌, దేవాదాయ శాఖ అధికారులతో సమావే శం నిర్వహించారు. 

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు..

ఎల్లమ్మ గుడి సమీపంలో రూ. 3.37 కోట్లతో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి తలసాని తెలిపారు. నిర్ధిష్ట గడువులో పనులు పూర్తి చేసి భక్తులకు కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ ఎస్‌ఈ జ్యోతిర్మయి, ఈఈ సత్యనారాయణరెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంత, మెట్రో రైల్‌ జీఎం రాజేశ్వర్‌రావు, ఈఈ ప్రసాద్‌, దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణ, సహాయ కమిషనర్‌ కృష్ణ, ఈవో అన్నపూర్ణ, ఈఈ మల్లికార్జున్‌, అమీర్‌పేట్‌ తహసీల్దార్‌ చంద్రకళ పాల్గొన్నారు.