సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Jul 20, 2020 , 23:02:29

మాతృ దేవోభవ

మాతృ దేవోభవ

ఎంటెక్‌ చేసినా.. అనారోగ్యంతో ఉన్న అమ్మ కోసం కూలీ పని

ప్రైవేట్‌ ఉద్యోగంతో సెలవులు వీలుకావని.. రోజు వారీగా పనికి వెళ్తున్న ఉమేశ్‌

ఎంటెక్‌ పూర్తి చేసినా.. అమ్మ కోసం భేషజాలు వీడాడు.. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తే ఎప్పుడంటే అప్పుడు సెలవులు పెట్టి తల్లిని చూసుకోవడం వీలుకాదని..

దినసరి  కూలీగా మారాడు. ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి 

ఆలనాపాలనా చూసుకుంటూనే.. వీలు దొరికినప్పుడు కూలీకి వెళ్తున్నాడు.

బడంగ్‌పేట : ఎంటెక్‌ చదువుకున్నా.. కన్న తల్లి ఆలనాపాలన కోసం కూలీ పనిచేస్తున్నాడు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో  చదువుకొని ఆపై పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించాడు. అమ్మకోసం చదువును పక్కన పెట్టి దినసరి కూలీగా మారాడు రాసని ఉమేశ్‌. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కర్మల్‌గూడ ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న  అలివేలు, శ్రీనివాస్‌ దంపతుల కుమారుడు ఉమేశ్‌. 15 ఏండ్ల క్రితం వీరు మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి పరిధిలోని దొడెగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఉమేశ్‌  ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల, రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నాడు. బీటెక్‌ పూర్తికాగానే ప్లేస్‌మెంట్‌ వచ్చింది.  అంతలోనే తల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్య ఖర్చుల కోసం దినసరి కూలీగా మారాడు. బంజారాహిల్స్‌లోని అపోలో దవాఖానలో ఉన్న తల్లి బాగోగులు చూసుకోవాల్సి రావడంతో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేయడానికి వీలుపడలేదు. దీంతో ఓ వైపు తల్లిని చూసుకుంటూ మరోవైపు కూలీ పనులకు వెళ్తున్నాడు.

చదువులో ప్రతిభ..

ఉమేశ్‌ సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌ ఏపీఆర్‌ఎస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకొని పదో తరగతిలో 600కు గాను 550 మార్కులు సాధించాడు. చౌటుప్పల్‌లోని సర్వేల్‌ ఏపీఆర్‌జేసీలో ఇంటర్‌ 876 మార్కులతో పాసయ్యాడు. ఎంసెట్‌లో ఫ్రీ సీటు సాధించి హయత్‌నగర్‌ మండలంలోని కుంట్లూర్‌లో ఉన్న ఎన్‌ఐటీఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ 72 శాతం మార్కులతో పాసయ్యాడు. ఇబ్రహీంపట్నంలోని  జాగృతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ పూర్తి చేశాడు. కాగా ప్రస్తుతం తల్లి కోసం కుర్మల్‌గూడలోని ఇందిరానగర్‌లో కూలీ పనిచేస్తున్నాడు.

ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడంతో..

మాది పేద కుటుంబం. ఇంట్లో ఆడ వాళ్లు లేక పోవడంతో అమ్మను చూసుకోవాల్సి వస్తుంది. అమ్మ కంటే చదువు, ఉద్యోగం ముఖ్యం కాదనిపించింది. ఎంటెక్‌ వరకు మంచి  మార్కులతో పాసయ్యాను. రోజు కూలీ చేసి వచ్చిన డబ్బులతోఅమ్మను చూసుకుంటున్నాను.

-రాసని ఉమేశ్‌