సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): అలసటను తగ్గించి.. మనసును ఉత్తేజరపరిచే మెడిసిన్ సంగీతం. లయ, శృతితో సాగే సంగీతంతో మనసు నిత్యనూతనంగా మారి బరువెక్కిన హృదయ భారం నుంచి ఉపశమనం పొందుతుంది. సంగీతానికి అంత శక్తి ఉంది. అట్లాంటి సంగీత కచేరీలు ఇప్పుడు పలు పార్కుల్లో ఉచితంగానే ఏర్పాటు చేసి వాకర్స్‌ను అలరిస్తున్నారు సంగీతకారులు అఖిలేష్ వాషికర్, గజేందర్ షేవాకర్. కరోనాతో అలజడికి గురై.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంగీత కచేరిలతో ఎంతో ఉపశమనం లభించనుంది. వాకర్స్‌ను ఆద్యంతం ఉత్సాహపరుస్తూ.. వారిలో పాజిటివ్ వైబ్స్ కలిగేలా చేస్తున్నారు. ఇటీవల నారాయణగూడలోని మేల్కోటే పార్క్‌లో మార్నింగ్ కచేరి నిర్వహించిన విషయం తెలిసిందే. వాకర్స్ నుంచి వస్తున్న స్పందనతో సుమారు 30 పార్కుల్లో కచేరి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.