బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:09:27

వర్షాకాల కార్యప్రణాళిక సిద్ధం చేసిన బల్దియా

వర్షాకాల కార్యప్రణాళిక సిద్ధం చేసిన బల్దియా

 నగరంలోని 30 ముంపు ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోసేందుకు జీహెచ్‌ఎంసీ మోటార్లను ఏర్పాటుచేసింది. నీరు చేరిన వెంటనే వాటంతటవే ప్రారంభమై నీటిని తొలగిస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సహాయక సిబ్బంది నీటికి అడ్డుగా ఉండే ప్లాస్టిక్‌ కవర్లు, మట్టి తదితరవాటిని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చూస్తారు.  ఈ మేరకు జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్‌ కార్యప్రణాళికను  రూపొందించింది.

హైదరాబాద్  :  అత్యంత సమస్యాత్మకంగా నగరంలో 30 ప్రాంతాలు ఉన్నాయి.వీటిలో మైనర్‌వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు 133 ఉండగా, ఈ ప్రాంతాల్లో మోటార్లను ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోయడం మినహా మరోప్రత్యామ్నాయం లేదు. ఇంజినీరింగ్‌ పనులు ద్వారా శాశ్వత పరిష్కారమార్గం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో మోటర్లను ఏర్పాటు చేశారు. వర్షం వచ్చిన వెంటనే ఆటోమెటిక్‌గా అవే ప్రారంభమై నీటిని సమీపంలోని డ్రైనేజీలోనికి ఎత్తిపోస్తాయి. 

మైనర్‌ వాటర్‌ లాగింగ్‌ పాయింట్ల వద్ద మనుషులతో నాలాలు, మ్యాన్‌హోళ్లలో ఇరుక్కుపోయిన చెత్తను తొలగించడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశమున్నది. దీంతో అధికారులు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను సర్కిళ్లవారీగా సిద్ధంచేశారు. వర్ష సూచన వచ్చిన వెంటనే వారు ఆయా ప్రాంతాలకు చేరుకొని నీరు నిలువకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ఇవి కాకుండా దాదాపు 100 ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లను సరిచేయడం, నీటిని సమీపంలోని వరద కాలువకు మళ్లించడం వంటి చర్యల ద్వారా ముంపు సమస్య లేకుండా చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎదురయ్యే సమస్యను అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. అంతేకాకుండా వర్షకాలం మినహా మిగిలిన కాలంలో రోడ్లపై గుంతల పూడ్చివేతకు ఉపయోగించే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌లను కూడా వరద సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు. సర్కిల్‌, జోనల్‌ అధికారులకు లోతట్టు ప్రాంతాల సమాచారం ఇచ్చినట్లు, క్షేత్రస్థాయి సహాయక బృందాలను వారే పర్యవేక్షిస్తారని తెలిపారు. 

మోటర్లు ఏర్పాటు చేసిన  ప్రాంతాలు 

 • హబ్సిగూడ మోడ్రన్‌ బేకరీ 
 • నాగోలు ఆదర్శనగర్‌ కాలనీ రోడ్‌ నం-1  
 • మలక్‌పేట్‌ ఆర్‌యూబీ 
 • యాకుత్‌పుర రైల్వేస్టేషన్‌ ఆర్‌యూబీ  
 • చాంద్రాయణగుట్ట వలీ ఫంక్షన్‌హాల్‌  
 • న్యూ అఫ్జల్‌ సాగర్‌  
 • బాటెక్‌రోడ్‌ దత్తాత్రేయ కాలనీ  
 • కరోల్‌ బాగ్‌ ‘ఏ’ 
 • టోలిచౌకీ సెవెన్‌ టూంబ్స్‌ రోడ్‌ హెచ్‌ఎస్‌ రెసిడెన్సీ  
 • నదీమ్‌ కాలనీ కల్వర్టు
 • జమాలికుంట ఔట్‌లెట్‌  
 • బేగంబజార్‌ ఎల్‌అండ్‌ ఓపీఎస్‌ ఎదురుగా  
 • రంగ్‌మహల్‌, లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌  
 • ఎమ్‌ఎస్‌ మక్తా
 • బల్కంపేట్‌ ఆర్‌యూబీ 
 • రాజ్‌భవన్‌ రోడ్‌ విల్లామేరీ కాలేజీ 
 • షేక్‌పేట్‌ ఆదిత్య టవర్స్‌  
 • షేక్‌పేట్‌ వివేకానంద నగర్‌  
 • జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-44 
 • మాదాపూర్‌ నెక్టర్‌ గార్డెన్స్‌ 
 • మాదాపూర్‌ శిల్పారామం ఏసీ బస్‌స్టాప్‌  
 • అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్‌ వైపు ఎల్‌అండ్‌ ఓపీఎస్‌ బాటా షోరూమ్‌ ఎదురుగా 
 • హఫీజ్‌పేట్‌ ఫ్లైఓవర్‌ రోడ్డు చివర, 
 • కొండాపూర్‌ ఆర్‌టీఏ ఆఫీసు  
 • రోడ్‌ నం-6 డామినోస్‌ ఎదురుగా
 • నింబోలి అడ్డా 
 • యూనివర్సల్‌ స్విమ్మింగ్‌ పూల్‌- శిర్డీనగర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద 
 • ఒలిఫెంటా బ్రిడ్జి, కర్బలా మైదాన్‌ మారుతి సుజుకీ షోరూమ్‌ వద్ద, 
 • రాణిగంజ్‌ క్రాస్‌రోడ్‌ బాంబే హోటల్‌ వద్ద 


logo