సమయాన్ని వృథా చేయొద్దనే ఒక అద్భుతమైన ఆలోచన ఒక ఇంటర్ విద్యార్థినికి ఆదాయాన్ని సమకూర్చుతోంది. విద్యార్థులకు సెలవులు దొరికితే ఏం చేస్తారు? ఇంట్లోనే ఖాళీగా సమయాన్ని వృథా చేస్తుంటారు. మరికొందరు బంధువుల ఇండ్లకు వెళ్లి సంతోషంగా గడుపుతుంటారు. కానీ, ఓ అమ్మాయి మాత్రం తనకు ఆర్థికంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేకున్నా.. సమయాన్ని వృథా చేయకూడదనే సంకల్పంతో బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ దుస్తులకు మెరుగులద్ది.. సాంకేతికత సాయంతో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఆమె.. త్రిషారెడ్డి. నగరానికి చెందిన ఆ యువతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తెలంగాణలో స్టార్టప్‌ల క్రేజ్‌ను చూసి ఆమె ఎప్పటి నుంచో స్టార్టప్ ప్రారంభించాలని భావించింది. అయితే, ఈ కరోనా సెలవుల్లో ఆమె తన ఆలోచనను కార్యరూపం దాల్చేలా చేసింది. త్రిఫ్ట్ స్టోర్ పేరిట ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించి నెల రోజుల్లో రూ.70 వేలు సంపాదించింది.
త్రిషారెడ్డి తొలుత తన సెకండ్ హ్యాండ్ దుస్తులను డ్రైక్లీనింగ్ చేసి ఇస్త్రీతో కొత్తవిగా కనిపించేలా చేసేది. ఆమెకు మోడలింగ్‌పై పట్టు ఉండటంతో వాటిని మరో ఆకారంలోకి మార్చేసేది. ఆ బ్రాండెడ్ దుస్తులకు చీప్‌గా లభించేలా ఆన్లైన్లో విక్రయానికి ఉంచేది. అవి ఎలాంటి దుస్తులు? బ్రాండ్ పేరు? కొనుగోలు చేసినప్పుడు ఉన్న ధర? విక్రయానికి ఉంచిన ధరల సమాచారం అంతా అందులో ఉంటుంది. ఉన్నత కుటుంబానికి చెందిన త్రిష బ్రాండెడ్ దుస్తులను సేకరించడంలో పెద్దగా కష్టపడలేదు. తనకు తెలిసిన చాలా మంది వారి దుస్తులను త్రిషకు అందించారు. వాటితో కొత్త రూపు వచ్చేల తీర్చిదిద్ది విక్రయానికి ఉంచేది. ఇందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియాను వినియోగించుకుంది. అంతేకాదు ఆ దుస్తులు ధరించే వారు ఎలా కనిపిస్తారో కస్టమర్లకు తెలియడం కోసం ఆమె వాటిని తొలుత ధరించి, మోడలింగ్ చేసి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేస్తుంది. వాటిని మళ్లీ డ్రైక్లీనింగ్ చేసి ఆర్డర్‌కు పంపిస్తుంది. ఇలా త్రిషారెడ్డి 17 ఏండ్ల వయసులోనే వ్యాపారంలో రాణిస్తుంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై ప్రాంతాల నుంచి ఆమెకు కస్టమర్లు ఉండటం విశేషం.
ఆలోచనను అమలు చేసేందుకు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కారణం.. సోషల్ మీడియా. దాని సాయంతో మనం ఏమైనా చేయొచ్చు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఖాళీ సమయాన్ని నాకున్న సాంకేతిక, మోడలింగ్ నాలెడ్జ్‌తో పెద్దగా డబ్బులు అవసరం లేకుండానే వ్యాపారాన్ని ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. సాధారణంగా బ్రాండెడ్ దుస్తులు వాడినవి అయినప్పటికీ అలా కనిపించవు. వాటికి మెరుగులు అద్దితే గుర్తించలేం. అవి చాలా తక్కువ ధరలకు లభిస్తే కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. – త్రిషారెడ్డి, యువ డిజైనర్