ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 24, 2021 , 04:54:12

ఇక ప్రజల్లోకి

ఇక ప్రజల్లోకి

  • 110 మంది అభ్యర్థులు 179 నామినేషన్లు
  • చివరి రోజూ భారీగా దాఖలు
  • 26న ఉపసంహరణ 
  • నేడు గ్రేటర్‌ ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం 

సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వారం రోజుల పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 110 మంది అభ్యర్థుల నుంచి 179 సెట్ల నామినేషన్లను స్వీకరించిన అధికారులు నిర్వహణ, నామినేషన్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇక నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారానికి ఉన్న 15 రోజుల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎత్తులు, పైఎత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉదయం వాకర్లతో, సాయంకాలం కాలనీ అసోసియేషన్లతో సమావేశమవుతున్నారు. మొత్తం 5.17 లక్షల ఓటర్లు ఉండగా, నియోజకవర్గాల వారీగా జాబితాలతో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ సత్తా చాటేలా పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నది. 

అరున్నరేండ్లలో అనేక ఖాళీల భర్తీ

గత ఆరున్నరేండ్లలో పోలీస్‌ శాఖతోపాటు అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంతోపాటు గతంలో ఎన్నడూలేని విధంగా జీతాలు పెంచడంలాంటి నిర్ణయాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొని అమలు చేస్తున్నది. ప్రస్తుతం కూడా అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం కొన్ని పోస్టులను కారుణ్య నియామకాల్లో భాగంగా భర్తీ చేయగా, మిగతా ఖాళీలను త్వరలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అదేవిధంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఐటీ, ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేయడం, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం వంటి అంశాలతో పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

110 మంది అభ్యర్థులు..179 నామినేషన్లు 

దాదాపు వారం రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. 110 మంది అభ్యర్థుల నుంచి 179 సెట్లను అధికారులు స్వీకరించారు. మంగళవారం చివరి రోజు 51 మంది అభ్యర్థులు 89 నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత నామినేషన్‌ వేయడానికి ఉన్న అభ్యర్థులకు టోకెన్‌లు జారీ చేసి అనంతరం పత్రాలను స్వీకరించారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి తరఫున హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరఫున ఎల్‌.రమణ బరిలో నిలిచారు. మంగళవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే భారీగా తరలివచ్చిన అభ్యర్థులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది.

26న నామినేషన్లు ఉపసంహరణ 

ఈనెల 26న (శుక్రవారం) నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత 15రోజుల పాటు ప్రచార సమయం ఉండనున్నది. వచ్చే నెల 14వ తేదీన పోలింగ్‌ జరుగనుండగా, మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నిక నియమ, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించారు.

నేడు నామినేషన్ల పరిశీలన  

బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి ప్రియాంకాఅల తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు కలిపి సంఖ్య పెద్దదిగా ఉండటంతో కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా 7వ అంతస్తులోని హాల్‌లో నామినేషన్ల పరిశీలన జరుపనున్నారు.

నేడు మంత్రి కేటీఆర్‌ సమావేశం 

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి కేటీఆర్‌ బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

VIDEOS

logo