బీజేపీది పూటకో మాట
_1606701959.jpg)
ఎర్రగడ్డ: పూటకోమాట చెబుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీకి గ్రేటర్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోరబండ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ తరఫున కవిత రోడ్‌షో నిర్వహించారు. అనంతరం వీకర్ సెక్షన్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్న బీజేపీ నేతలకు ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. పేదల పక్షపాతి కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన బాబా ఫసియుద్దీన్‌ను ఈ ఎన్నికల్లో గ్రేటర్‌లోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బోరబండను మరింత అభివృద్ధిపర్చటానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కవిత కోరారు.
తెలంగాణ పోరాట యోధుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఫ్రొఫెసర్ జయశంకర్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, తుర్రెబాజ్‌ఖాన్, కొమ్రం భీం తదితరుల పేర్లను డివిజన్లోని కమ్యూనిటీహాళ్లకు పెట్టడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఎమ్మెల్సీ కవిత బోరబండ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షో గులాబీమయంగా మారింది. బోరబండ బస్టాండ్, సైట్-2, సైట్-3 కాలనీల మీదుగా వీకర్‌సెక్షన్ వరకు కొనసాగింది. మహిళలు బోనాలతో కవితకు ఘన స్వాగతం పలికారు. వడ్డెర సంఘం జాతీయాధ్యక్షుడు వేముల లక్ష్మణ్ కవితకు సాదర స్వాగతం పలికి సన్మానించారు.