గురువారం 28 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 09:44:08

బీజేపీ బూటకపు మాటలను తిప్పి కొట్టాలి

బీజేపీ బూటకపు మాటలను తిప్పి కొట్టాలి

కవాడిగూడ, నవంబర్‌ 27 : ముషీరాబాద్‌ నియోజక వర్గంలో ఆరింటికి ఆరు సీట్లను గెలుచుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌ రావు స్వగృహమైన గాంధీనగర్‌లో  నియోజక వర్గంలోని ముఖ్య నాయకులతో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చించారు. ముందుగా ఎమ్మెన్‌ శ్రీనివాస్‌ రావు దంపతులు ఎమ్మెల్సీ కవితకు పూల బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్పాహారం చేసిననంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ నియోజక వర్గంలోని ఆరు డివిజన్‌ల పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, సీనియర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌ రావులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను చైతన్యం చేయాలని ఆమె కోరారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. 

మతతత్వ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోతే వారిని కలిసి మందలించని బీజేపీ పార్టీ నేతలు నేడు ఎన్నికలు రాగానే కేంద్ర మంత్రులు, ఎంపీలు వచ్చి ఊకదంపుడు మాటలు చేపుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ వరద బాధితులకు రూ. 10 వేలు ఇచ్చి ఆదుకున్నారని, అది జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి బాధితుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టారని అన్నారు. అదే కాకుండా ఎన్నికలలో గెలిస్తే 25 వేల రూపాయలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టే వాగ్ధానాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చిల్లి గవ్వ ఇవ్వని బీజేపీ ఏం ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతారని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నగర విభాగం నాయకుడు ముఠా జయపింహ, భోలక్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి బింగి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo