బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 20, 2020 , 10:01:05

ఉనికిని కాపాడుకునేందుకే చిల్లర రాజకీయాలు

ఉనికిని కాపాడుకునేందుకే చిల్లర రాజకీయాలు

బంజారాహిల్స్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు వరదలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధి వినాయక్‌నగర్‌లో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మాగంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా వర్షాలు కురవడంతో హైదరాబాద్‌లో వరద పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి కేటీఆర్‌తో సహా అన్ని స్థాయిల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు బాసటగా నిలుస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తూ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నడూ ఊహించని ప్రకృతి విపత్తు వస్తే ప్రజలకు అండగా నిలబడడంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఇండ్లు కూలినవారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారని పేర్కొన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాహుల్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాగరాజు, షరీఫ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత సీఎన్‌.రెడ్డి, బస్తీ అధ్యక్షుడు సింగారి శ్రీనివాస్‌, లియాఖత్‌ అలీ, అరుణ్‌కుమార్‌, మన్సూర్‌, సుబ్బరాజు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌లో చేరికలు

బంజారాహిల్స్‌ : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని టీ అంజయ్యనగర్‌లో పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక నాయకులు నరేశ్‌, శివ, నర్సింహయాదవ్‌, వెంకటమ్మ, యాదమ్మ, భూలక్ష్మితోపాటు సుమారు 200 మంది కార్యకర్తలు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పేదల బస్తీల్లో ఇండ్లు కలిగి ఉన్న వారందరికీ ఉచితంగా క్రమబద్ధీకరణ చేయించేందుకు ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేయనున్నదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎన్‌.రెడ్డి. డివిజన్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి షరీఫ్‌, నర్సింహారెడ్డి, అరుణ్‌, లియాఖత్‌ అలీ, సుబ్బరాజు పాల్గొన్నారు.