e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home హైదరాబాద్‌ అంబర్‌పేట అభివృద్ధికి రూ.132 కోట్లు

అంబర్‌పేట అభివృద్ధికి రూ.132 కోట్లు

అంబర్‌పేట అభివృద్ధికి రూ.132 కోట్లు
  • అన్ని పనులకు నిధులు మంజూరు
  • ముస్లిం, క్రిస్టియన్ల గ్రేవ్‌ యార్డుకు ఐదున్నర ఎకరాల స్థలాలు
  • పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, ఏసీ బస్టాండ్ల ఏర్పాటు
  • సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం
  • కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభం
  • వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

అంబర్‌పేట, మే 28: అంబర్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే అంబర్‌పేట నియోజకవర్గంలో రూ.132 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తెలిపారు. మేజర్‌ వర్క్స్‌తో పాటు సీసీ, వీడీసీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ల ఏర్పాటు, వర్షపునీటి పైప్‌లైన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఏసీ బస్టాండ్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులకు నిధులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌ ఈఈ శంకర్‌, డీఈ సుధాకర్‌లతో శుక్రవారం కలిసి ఆయన త్వరలోనే చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.

ఈ ఏడాది జనవరి 16న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించగా, ఆ సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయమై ప్రతిపాదనలు మంత్రికి అందించినట్టు తెలిపారు. మూడు రోజుల క్రితం మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అర్వింద్‌ కుమార్‌తో సమావేశమై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించగా, పలు పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రధానంగా అంబర్‌పేట అలీ కేఫ్‌ చౌరస్తా నుంచి ముసారం బాగ్‌ వరకు మూసీనదిపై రూ.30 కోట్లతో ఎలివేటెడ్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో టెండర్లు పిలుస్తున్నారని చెప్పారు.

మూసీ ప్రవాహంతో ఇబ్బందులు తొలిగేందుకు..

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూసీ పొంగినప్పుడు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ ఏడాది వరదలకు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ధ్వంసమైందన్నారు. ఈ ఇబ్బందులు తొలిగించేందుకు కొత్తగా ఎలివేటెడ్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అదే విధంగా అలీకేఫ్‌ చౌరస్తా నుంచి నాగోల్‌ వరకు 120 ఫీట్ల లింక్‌ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరయ్యాయని, 15 రోజుల్లో టెండర్లు కూడా పిలుస్తున్నారని చెప్పారు.

శ్మశానాల ఆధునీకరణ.. నాలా నిర్మాణం

అంబర్‌పేట హర్రాస్‌ పెంట శ్మశాన వాటికను రూ.9 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, అందుకు కావాల్సిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని తెలిపారు. మహా ప్రస్థానంగా మార్చాలన్నదే తన ధ్యేయమన్నారు. నల్లకుంట డివిజన్‌ రత్నానగర్‌ వద్ద హుస్సేన్‌సాగర్‌ నాలాకు రూ.31 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పనులను జూన్‌ నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. రత్నానగర్‌ నుంచి గోల్నాక వరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. గత వరదల సందర్భంగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రత్నానగర్‌ను సందర్శించి ఇక్కడి ప్రజల ఇబ్బందులను గమనించి నాలా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారని, మాట ప్రకారం ఇప్పుడు రూ.31 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.

ఎనిమిది పార్కుల అభివృద్ధికి చర్యలు

నియోజకవర్గంలోని ఎనిమిది పార్కులను రూ.2.98 కోట్లతో థీమ్‌, మోడ్రన్‌ పార్కులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇందులో కేవలం విక్రమ్‌నగర్‌ పార్కు ఒక్కదాని అభివృద్ధికే రూ.కోటి వెచ్చిస్తున్నామని వెల్లడించారు. రూ.5.30 కోట్లతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే, మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ల నిర్మాణానికి జలమండలి ఎండీ రూ.2 కోట్లను మంజూరు చేశారని తెలిపారు.

నియోజకవర్గంలో ఏసీ బస్టాపులు

తొమ్మిది చోట్ల ఏసీ బస్టాపులను కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. నారాయణగూడ, ఫీవర్‌ చౌరస్తా, ఓయూ, అలీకేఫ్‌, బర్కత్‌పుర, కాచిగూడ జంక్షన్లను అందంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. బాగ్‌ అంబర్‌పేట సాయిబాబా టెంపుల్‌ వద్ద 20 ఫీట్ల వరకు రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుందన్నారు.

శ్మశానాల అభివృద్ధికి ప్రతిపాదనలు

మొయిన్‌ చెరువు గ్రేవ్‌ యార్డు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులన్నీ కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయన్నారు. ముస్లిం గ్రేవ్‌ యార్డు కోసం అంబర్‌పేట ఎస్టీపీ వద్ద నాలుగు ఎకరాలు, క్రిస్టియన్ల గ్రేవ్‌ యార్డుకు ఎకరన్నర ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించినట్టు చెప్పారు. ఆ వివరాలను కలెక్టర్‌కు పంపించారన్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత ఫ్లైఓవర్‌ పనులు..

గోల్నాక నుంచి ముక్రం హోటల్‌ వరకు నిర్మిస్తున్న అంబర్‌పేట ఫ్లైఓవర్‌ పనులు లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. 281 ప్రాపర్టీలను జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. యుటిలిటీస్‌ కోసం ఇప్పటికే జలమండలి, విద్యుత్‌ శాఖకు డబ్బులు చెల్లించిందని, కరెంట్‌ పోల్స్‌ షిఫ్టింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అంబర్‌పేట అభివృద్ధికి రూ.132 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement