శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Oct 17, 2020 , 07:48:47

ఆందోళనపడొద్దు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

ఆందోళనపడొద్దు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

  • నాలా రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంచుతాం
  • ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి తలసాని 
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద నీటి ముంపునకు గురైన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ముషీరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, అధికారులతో కలిసి పర్యటించారు. గాంధీనగర్‌ పరిధిలో అరుంధతినగర్‌, అడిక్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని నాగమయికుంట, పద్మానగర్‌, పాపడ్‌గల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ అన్నివిధాలుగా సహాయక చర్యలను చేపడుతుందని హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌ నుంచి నీటి విడుదల వల్ల నాలా పొంగి తమ ఇండ్లలోకి నీరు చేరిందని, నాలా వెంట రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంచితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావని అరుంధతినగర్‌ కాలనీవాసులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న మూడు అడుగుల రిటైనింగ్‌ వాల్‌ను 10 అడుగుల ఎత్తుకు పెంచి  నిర్మించేందుకు చర్యలు చేపడుతామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.  ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదైందని, నాలాలపై, నాలాల వెంట నిర్మాణాలు ఉన్న ప్రాంతాలే అత్యధికంగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారని ఆయన వివరించారు. ప్రజలు అంటు వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, ఆర్డీఓ వసంత, డీసీ ఉమాశంకర్‌, ఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.